calender_icon.png 27 September, 2024 | 6:53 AM

భయం వద్దు.. అండగా మేం ఉన్నాం

09-09-2024 03:19:22 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఖమ్మం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఖమ్మం ముంపు ప్రాంతా ప్రజలు భయపడవద్దని అండగా ప్రభుత్వం ఉన్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఖమ్మం మున్నేరుకు మళ్లీ ప్రమాదకరస్థాయిలో వరద పోటెత్తుతుందని తెలియగానే హైదరాబాద్ నుంచి ఆయన శనివారం అర్ధరాత్రి ఖమ్మం చేరుకుని, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద నియంత్రణ చర్యలను దగ్గరుండి ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. మరో రెండుమూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఉన్న ప్రజలందర్ని సురక్షిత ప్రాంతాలు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ధ్వంసలాపురం అగ్రహారం కాలనీని వరద ముంచెత్తుందని తెలియగానే హుటాహుటిన ఆయన అక్కడికి వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు, వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలకు అందుబాటులో ఉండి, ఇబ్బందులు తలెత్తకుండా  చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులకు చెప్పాలని బాధితులకు సూచించారు. అనంతరం మధిర నియోజకవర్గంలో పర్యటించి, వరద పరిస్థితిని తెలుసుకున్నారు. చింతకాని మండలంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాల ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

జాతీయ విపత్తుగా ప్రకటించేలా ఒత్తిడి తేవాలి

బీజేపీ ఎంపీలకు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి 

జాతీయ విపత్తుగా ప్రకటించి, తెలంగాణకు పెద్ద ఎత్తున వరద సాయం అందించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ఎంపీలను, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఆదివారం ఖమ్మం నగరంలోని వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమని తామేమి భేషజాలకు పోవడం లేదని, కష్టకాలంలో రాజకీయాలు తగవన్నారు. వరదలతో ఖమ్మం నగరం విపరీతంగా నష్టపోయిందని, ప్రజలు సర్వం కోల్పోయారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.

మానవతా దృక్పథంతో కేంద్రం స్పందించి విధాలా ఆదుకోవాలని కోరారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీని సీఎం రేవంత్‌రెడ్డి బడేబాయ్ అన్నందుకు ప్రతిపక్షం రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ పాకులాడుతుందని విమర్శించారు.  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకునేందుకు శ్రమిస్తున్నాయన్నారు. మొదటి విడతగా సోమవారం నుంచి వరద బాధితుల ఖాతాల్లోకి కొంత డబ్బును జమ చేస్తున్నామని వెల్లడించారు.