calender_icon.png 2 October, 2024 | 2:00 PM

జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయండి

02-10-2024 02:59:07 AM

బీజేపీ నేతలు రైతు దీక్షలు చేయడం వింతగా ఉంది

ప్రధాని మోదీని అడిగి రాష్ట్రానికి నిధులు తేవాలి

ఆర్థిక భారమైనా రైతులకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం 

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రైతులను ఏనాడూ పట్టించుకోని బీజేపీ నేతలు.. వారి కోసం దీక్షలు చేయడం విడ్డూరంగా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాలని బీజేపీ నాయకులకు సూచించారు.

అన్నదాతలపై మొసలికన్నీరు కారుస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ఎత్తుగడలు వేస్తుందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని సవాల్ విసిరారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ నల్ల చట్టాల రద్దు కోసం పోరాడుతూ వందలాది మంది రైతులు చనిపోయిన మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరు ఉండాలనే పోటీలో భాగంగా నేతలు దీక్షలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రూ.7,200 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉండగా కేవలం రూ.1,300 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఫసల్ బీమా ప్రీమియం తమ ప్రభుత్వమే చెల్లించిందని స్పష్టంచేశారు. రేషన్ కార్డు లేని వారికి కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గాయని ఉద్ఘాటించారు. రుణమాఫీ తరువాత రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు మూడు విడతల్లో 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు.

42 లక్షల రైతుల ఖాతాలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని, కుటుంబ నిర్దారణ కాని వారు, రూ. 2 లక్షలపై రుణం ఉన్నవారు ఇంకా మిగిలినట్టు చెప్పారు. రైతులు రూ.2లక్షలకు పైన ఉన్న మొత్తం చెల్లించిన వెంటనే ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన నేతలు కూడా రుణమాఫీ గురించి మాట్లాడటం సరికాదన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయిన రైతు రుణమాఫీ చేశామని, మూడు విడతల్లో రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం ఉంచిన రైతు బంధు బకాయిలు రూ.7,656 కోట్లు కూడా వేశామని స్పష్టంచేశారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా మంత్రిగా పనిచేశానని అన్నారు. 

పామాయిల్ గెలల ధర పెంపు 

తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలని పామాయిల్ గెలల టన్ను ధరను రూ.17,043కు పెంచినట్టు మంత్రి తుమ్మల  తెలిపారు. కేంద్రం ఇటీవల ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. దీంతో ముడిపామాయిల్ గెలల ధర రూ.14,392 నుంచి రూ.2651 పెంపుతో రూ.17,043కు చేరుకుందన్నారు.

పెరిగిన ధరలు ఈ నెల నుంచి అమలులోకి వస్తాయన్నారు. దీంతో రైతులకు అదనంగా రూ.12 కోట్ల లబ్ధి చేకూరునుందని చెప్పారు. రాష్ట్రంలో 44,444 ఎకరాల పామాయిల్ తోటల నుంచి ఏడాదికి 2.80 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తుందన్నారు. ధర పెరుగుదల 9,366 మంది రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు.