calender_icon.png 30 September, 2024 | 10:57 AM

ఎన్డీయేలోకి డీఎంకే?

30-09-2024 12:00:00 AM

ప్రధానిని కలువగానే కొడుకుకు ప్రమోషన్

కాంగ్రెస్ నుంచి దూరం జరుగుతున్న స్టాలిన్

చెన్నై, సెప్టెంబర్ 29: తమిళనాడు రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతు న్నాయి. కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన మిత్రుడిగా, బీజేపీని కనీసం దగ్గరకు కూడా రానీయకుండా కొనసాగుతున్న అధికార డీఎంకే ఉన్నట్టుండి అనూహ్య మలుపు తీసుకొంటున్నదా? అనే చర్చ జరుగుతున్నది.

వారం క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిం చిన తమిళనాడు సీఎం స్టాలిన్.. కొద్దిరోజుల క్రితం ప్రధానిని కలిసిన తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. చాలాకాలంగా తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా స్పందించని సీఎం స్టాలిన్.. శనివారం చడీచప్పుడు లేకుండా వారసుడికి ప్రమోషన్ ఇచ్చేశారు.

అంతేకాదు ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఇద్దరు ఆప్తమిత్రులైన నేతలను మళ్లీ మంత్రులుగా నియమించాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కోరటం, ఆయన వెంటనే నియమించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొన్నటివరకు డీఎంకే ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటం చేసిన గవర్నర్ వారంలోనే ఆప్త మిత్రుడిగా మారిపోయాడు.

దీని వెనుక ప్రధాని మోదీ మంత్రాంతం ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ నడుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు తిరక్కుండానే వారు తమ డిమాండ్ల చిట్టా తెరిచారు. సహజంగానే ఎవరి ఆధిపత్యాన్ని సహించని మోదీ.. తన ప్రభుత్వం ఈ ఇద్దరు సీఎంలపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తున్నారు.

వీరికి చెక్ పెట్టాలంటే మరో మిత్రుడిని వెతుక్కోవాలి. టీడీపీకి 16, జేడీయూకు 12 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. డీఎంకేకు 22 ఉన్నాయి. ఇప్పుడు డీఎంకేను ఎన్డీయేలో చేర్చుకొంటే మోదీయే చంద్రబాబు, నితీశ్‌తో ఆడుకోవచ్చు.. ప్రధాని ఆ పనిలోనే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.