17-03-2025 01:18:51 AM
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): లిక్కర్ కుంభకోణంలో అనేక మంది డీఎంకే నాయకుల ప్రమేయముందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల ప్రజాధన్నాన్ని దోపిడీ చేసి, ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా డీఎంకే పార్టీ అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ వితండవాదానికి తెరలేపారని ఫైరయ్యారు. దక్షిణ భారతదేశానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తోందంటూ, దాన్ని ఎదుర్కొంటామనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖుల తో సమావేశం నిర్వహిస్తామంటూ ప్రకటించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని, ప్రజల దృష్టి మళ్లించేందుకే సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు, డీలిమిటేషన్ అంశంపై డీఎంకే, కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
వచ్చే ఆరునెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్ని కల్లో డీఎంకే ఓడిపోనుందని, ఆ పార్టీ పాలన, స్టాలిన్ కుటుంబ అవినీతి, దోపిడీ, నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. దాన్నుంచి తప్పించుకోవడానికి రాజకీయ నాటకాలు ఆడేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారని ఆరోపించారు.
ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హిందీ భాషను, డీలిమిటేషన్‌ను బూచీగా చూపి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది కాదని, 1986లో కాంగ్రెస్ హయాంలోనే డీఎంకే మిత్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టినట్టు గుర్తుచేశారు. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. హిందీయేతర రాష్ట్రాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్టు చెప్పారు.
త్రిభాషా సిద్ధాంతం బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైందని, నరేంద్ర మోదీ కొత్తగా ప్రవేశపెట్టలేదన్నారు. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఆలోచనలతోనే త్రిభాషా సిద్ధాంతం వచ్చిందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కొఠారీ కమిషన్ త్రిభాషా సిద్ధాంతాన్ని మరింత బలపరిచిందని, ఇవన్నీ డీఎంకే నాయకత్వానికి బాగా తెలుసన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఏ రాష్ర్టంపైనా హిందీని బలవంతంగా రుద్దలేదని స్పష్టం చేశారు.