డిఎం అండ్ హెచ్ ఓ హరీష్ రాజ్
మంచిర్యాల, (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ హరీష్ రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పైన పరీక్షలు చేయడం జరుగుతుందని, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. జిల్లాలోని వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఇంటింటికి తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని నమోదు చేసుకోవాలని, ఆయా ఉప కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాలను, గర్భవతుల నమోదు, టీకాలు ఆసుపత్రులలో ప్రసవాలు అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ మందుల పంపిణీ, టెలి మెడిసిన్, జాతీయ కార్యక్రమాలలో ముందుండాలని ఆదేశించారు. అనంతరం హెచ్ఐవి, ఎయిడ్స్ స్క్రీనింగ్ పరీక్షల కొరకు జిల్లాలోని పల్లె దవఖానాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల సూపర్వైజర్ లు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ ఎస్ అనిత, డాక్టర్ అనిల్, డిపిఓ ప్రశాంతి, ఎయిడ్స్ జిల్లా అధికారి నీలిమ రాజేష్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.