రూ.2,02,140 కోట్ల విలువతో అగ్రస్థానం
తర్వాతి స్థానాల్లో మాక్రోటెక్, ఇండియన్ హోటల్స్
అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌కూ టాప్--10 లో చోటు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (విజయక్రాంతి): దేశంలోని అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో డీఎల్‌ఎఫ్ అగ్రగామిగా నిలిచింది. రియాల్టీలో డీఎల్‌ఎఫ్ విలువ రూ.2,02,140 కోట్లు అని తాజాగా గ్రోహె - -హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ నివేదిక వెల్లడించింది. 2024 సంవత్సరానికి సంబంధించి వంద టాప్ కంపెనీల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. డీఎల్‌ఎఫ్ తర్వాత రూ.1,36,730 కోట్లతో మాక్రోటెక్ డెవలపర్స్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే రూ. 79,150 కోట్లతో ఇండియన్ హెటల్స్, రూ.77,280 కోట్లతో గోద్రేజ్ ప్రాపర్టీస్, రూ.66,200 కోట్లతో ఒబెరాయ్ రియల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రూ. 56,500 కోట్ల విలువతో అదానీ రియల్టీ ఏడో స్థానంలో నిలువగా, హైదరాబాద్‌కు చెందిన అపర్దా కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ రూ.33,130 కోట్ల విలువతో టాప్--10లో చోటు దక్కించుకుంది. అలాగే రియల్ ఎస్టేట్ ఎంటర్‌ప్రెన్యూర్లలోని టాప్--5 జాబితాలో కూడా డీఎల్‌ఎఫ్ స్థానం దక్కించుకుంది.
ప్రథమ స్థానంలో రాజీవ్‌సింగ్
డీఎల్‌ఎఫ్‌కు చెందిన రాజీవ్‌సింగ్ రూ. 1,24,420 కోట్ల ప్రాపర్టీ కలిగి ప్రథమ స్థానంలో ఉన్నారు. మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మా క్రోటెక్ డెవలపర్స్) రూ.91,700 కోట్ల ప్రాప ర్టీతో రెండో స్థానంలో ఉండగా... గౌతమ్ అదానీ కుటుంబం (అదానీ రియల్టీ) రూ.56,500 కోట్లతో మూడో స్థానంలో ఉంది. వికాస్ ఒబెరాయ్ (ఒబెరాయ్ రియల్టీ) రూ.44,820 కోట్ల ప్రాపర్టీతో నాలుగో స్థానంలో, చంద్రు రహేజా కుటుంబం (కె.రహేజా గ్రూప్) రూ.43,710 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కలిపి రూ.14.2 లక్షల కోట్లు విలువ కలిగి దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తద్వారా భారత్ ఆసియాలోనే రియల్ ఎస్టేట్ రాజధానిగా మారిందని గ్రోహె -హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ నివేదిక పేర్కొంది.