calender_icon.png 20 January, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజేలపై నిషేధం ఉండాల్సిందే

04-10-2024 12:00:00 AM

గ్రేటర్ హైదరాబాద్ పరిధి, పరిసర ప్రాంతాలలో మత పరమైన ఊరేగింపులలో డీజే వినియోగం, బాణ సంచాలు కాల్చటాన్ని నిషేధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించదగ్గ చర్య. అయితే, ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా అన్ని పోలీసు స్టేషన్ల  అధికారులు చర్యలు తీసుకోవాలి. నగర ప్రజలు విపరీతమైన ధ్వని కాలుష్యంతో, వినికిడి సమస్యలు, రక్తపోటు, కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు.

శ్రుతి మించిన డీజే శబ్దాలవల్ల చదువుకునే విద్యార్థులకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఉద్యోగులకు ఏకాగ్రత దెబ్బ తింటుంది. వయోధికులకు ఎటూ ఆరోగ్య సమస్యలు తప్పవు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.

అనుమతి లేకుండా డీజే వాడిన వారిపై,  సంస్థలపై భారీ జరిమానాలు విధించాలన్న నిర్ణయం కూడా హర్షణీయం. మతపరమైన పూజల కోసం ఉచితంగా విద్యుత్ వాడకాన్ని కూడా నిషేధించాలి. ఈ నిషేధాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాలకు వర్తించేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

 నేదునూరి కనకయ్య, హైదరాబాద్