calender_icon.png 10 January, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిక్వార్టర్స్‌కు జొకోవిచ్

09-10-2024 12:30:44 AM

షాంఘై: కెరీర్‌లో వందో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. షాంఘై మాస్టర్స్ ఏటీపీ 1000 టోర్నీలో జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొకోవిచ్ 6-1, 6-2తో ఫ్లావియో కొబొల్లిపై సునాయాస విజయాన్ని అందుకున్నాడు.

రెండు సెట్లలోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్న జొకోవిచ్ తన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. గంటపాటు సాగిన పోరులో  3 ఏస్‌లు సంధించిన జొకో 19 విన్నర్లు సంధించాడు. మరోవైపు 6 విన్నర్లకే పరిమితమైన కొబొల్లి 26 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్ 61వ ర్యాంకర్ రోమన్ సఫియుల్లిన్‌తో తలపడనున్నాడు.

షాంఘై మాస్టర్స్‌లో జొకోవిచ్ మరోసారి ఎరుపు రంగు డ్రెస్‌తో బరిలోకి దిగడం విశేషం. 2009లో ప్రారంభమైన షాంఘై మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్ ప్రారంభ ఏడాది మినహా అప్పటినుంచి బరిలోకి దిగిన ప్రతీసారి రెడ్ డ్రెస్ ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా సఫియుల్లిన్ రెండో రౌండ్‌లో 13వ సీడ్, అమెరికా స్టార్ ఫ్రాన్సస్ టియాఫోను 5-7, 7-5, 7-6(7/5)తో మట్టికరిపించాడు.

ఇక 9వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో పాటు 10వ సీడ్ సిట్సిపాస్ ముందంజ వేశారు. ప్రిక్వార్టర్స్‌లో సిట్సిపాస్‌తో ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ తలపడనున్నాడు. ఇప్పటివరకు ఈ ఇద్దరు 14 సార్లు తలపడగా మెద్వెదెవ్ 9-4తో సిట్సిపాస్‌పై పైచేయిలో ఉన్నాడు.

మిగతా మ్యాచ్‌ల్లో టేలర్ ఫ్రిట్జ్, గేల్ మొన్‌ఫిల్స్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఇక ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) ప్రిక్వార్టర్స్‌లో షెల్టన్ (అమెరికా)ను ఎదుర్కోనుండగా.. మూడో ర్యాంకర్ అల్కరాజ్ ఫ్రాన్స్‌కు చెందిన మొన్‌ఫిల్స్‌తో తలపడనున్నాడు.

వుహాన్ బరిలో సబలెంకా, గాఫ్

వుహాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో టాప్-8 సీడ్ ఆటగాళ్లకు నేరుగా రెండో రౌండ్ ఆడనున్నారు. వీరిలో స్వియాటెక్, సబలెంకా, గాఫ్ తదితరులు ఉన్నారు. ఇక తొలి రౌండ్‌లో సైనికోవా 6-3, 6-1తో పిలిప్పీన్స్‌కు చెందిన అలెగ్జాండ్రా ఎలాపై విజయం సాధించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో అలెగ్జాండ్రా సబలెంకాను ఎదుర్కోనుంది. మిగతా మ్యాచ్‌ల్లో కేటీ బౌల్టర్, అమండా, జెంగ్ క్వినెన్‌లు ముందంజ వేశారు.