- సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కారాజ్‌పై విజయం
- ఒలింపిక్స్ స్వర్ణంతో గోల్డెన్ గ్రాండ్‌స్లామ్ పూర్తి
పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ టెన్నిస్ విజేతగా సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7 (7/3), 7 (7/2)తో స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కారాజ్‌పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో జొకోవిచ్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో జొకోవిచ్ రెండు గేమ్‌లను టైబ్రేక్‌లోనే గెలుచుకోవడం గమనార్హం. మ్యాచ్‌లో ఒక ఏస్ కొట్టిన జొకోవిచ్ 25 విన్నర్లు సంధించాడు. మరోవైపు 41 విన్నర్లు కొట్టిన అల్కారాజ్ 33 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.
జొకోవిచ్ తన కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించినప్పటికీ ఒలింపిక్స్‌లో గోల్డ్ కలగానే ఉండేది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గినప్పటికీ కెరీర్ గోల్డెన్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేయలేకపోయాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో దానిని పూర్తి చేసుకున్నాడు. ఇక 1908 నుంచి చూసుకుంటే ఒలింపిక్స్‌లో టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణం సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాతీయ జెండాను పట్టుకున్న జొకోవిచ్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యాడు.