- 28వ ర్యాంకర్ చేతిలో ఓడిన సెర్బియా వీరుడు
- ప్రిక్వార్టర్స్‌కు గాఫ్, సబలెంకా
- మూడో రౌండ్‌కు బోపన్న, యూకీ బాంబ్రీ జోడీలు
- యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కార్లోస్ అల్కారాజ్ ఓటమి మరువక ముందే మరో సంచలనం నమోదైంది. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా మూడో రౌండ్‌లో 28వ ర్యాంకర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. మూడో సీడ్ అల్కారాజ్ ఇంటిబాట పట్టిన ఒక్క రోజు వ్యవధిలోనే డిఫెండింగ్ చాంపియన్ కూడా వెనుదిరగడం టెన్నిస్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ తన పట్టు నిలుపుకోగా.. రెండో ర్యాంకర్ సబెలంకా జోరును ప్రదర్శిస్తూ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. డబుల్స్‌లో బోపన్న జోడీతో పాటు యూకీ బాంబ్రీ జంట మూడో రౌండ్‌కు చేరుకున్నారు.
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన మూడో రౌండ్‌లో జొకోవిచ్ (సెర్బియా) 4-6, 4-6, 6-2, 4-6 ప్రపంచ 28వ ర్యాంకర్ అలెక్సి పొపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం చవిచూశాడు.
దాదాపు 3 గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో 16 ఏస్‌లు కొట్టినప్పటికీ 14 డబుల్స్ ఫాల్ట్స్‌తో జొకోవిచ్ మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్‌తో తలపడిన పొపిరిన్ ఒత్తిడి ఏమాత్రం దరిచేరినీయలేదు. 15 ఏస్‌లు కొట్టిన పొపిరిన్ 50 విన్నర్లతో జొకోపై ఆధిపత్యం చెలాయించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో టియాఫో, దిమిత్రోవ్, రుబ్లేవ్, జ్వెరెవ్, రూడ్‌లు ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు.
సబలెంకా, గాఫ్ జోరు
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా తన జోరును కొనసాగిస్తుంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో సబలెంకా (బెలారస్) 2-6, 6-1, 6-2 అలెక్సాండ్రోవా (రష్యా) పై విజయం సాధించి నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మూడో సీడ్ కోకో గాఫ్ 3-6, 6-3, 6-3 స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 2 గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో గాఫ్ 4 ఏస్‌లు కొట్టగా.. స్వితోలినా రెండు ఏస్‌లకే పరిమితమైంది. అయితే ఏడు డబుల్ ఫాల్ట్స్ చేసి మూల్యం చెల్లించుకుంది.
మిగిలిన మ్యాచ్‌ల్లో అమెరికా స్టార్ ఎమ్మా నవ్వారో 6-4, 4-6, 6-3 19వ ర్యాంకర్ మర్తా కోస్త్యుక్ (ఉక్రెయిన్) పై, డొనా వెకిక్ (క్రొయేషియా) అమెరికాకు చెందిన స్టీర్న్స్‌పై, ఏడో సీడ్ జెంగ్ జర్మనీకి చెందిన నీమియర్‌పై విజయాలు సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఇక 14వ సీడ్ మాడిసన్ కీస్‌తో పాటు 20వ సీడ్ విక్టోరియా అజరెంకా పరాజయాలు చవిచూశారు.
2002 తర్వాత ఇదే..
ఓపెన్ టెన్నిస్ శకంలో ఫెదరర్, నాదల్ తర్వాత అత్యంత పాపులారిటీ సంపాదించిన నొవాక్ జొకోవిచ్ తన కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. 2023లో మునుపటి ఫామ్‌ను తలపిస్తూ వింబుల్డన్ మినహా మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి ఔరా అనిపించాడు. ఈ ఏడాది వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌లో వెనుదిరిగాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో గాయంతో వెనుదిరిగాడు.
తాజాగా యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి మూడో రౌండ్‌లోనే వెనుదిరగడం మింగుడుపడని అంశం. 2002 తర్వాత ఒక ఏడాదిలో జరిగిన అన్ని గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బిగ్ (ఫెదరర్, నాదల్, జొకోవిచ్) కాకుండా మిగిలిన వాళ్లు విజేతగా నిలవడం మళ్లీ ఇదే కావడం గమనార్హం. ఇక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ మూడో రౌండ్‌లో వెనుదిరగడం ఇది మూడో సారి. 2005, 2006లో వరుసగా ఆస్ట్రేలియా దిగ్గజం లిటన్ హెవిట్ చేతిలో ఓడిన జొకోవిచ్ మూడో రౌండ్‌లో ఇంటిముఖం పట్టాడు. 37 ఏళ్ల జొకోవిచ్ యూఎస్ ఓపెన్ (2011, 2015, 2018, 2023) నాలుగుసార్లు కైవసం చేసుకున్నాడు.