calender_icon.png 24 January, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజే సౌండ్లపై కఠినంగా వ్యవహరించాలి

13-07-2024 12:41:52 AM

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హైదరాబాద్ ఫంక్షన్ హాళ్లలో శబ్ద నియంత్రణకు నిబంధనలు కఠినంగా అమలు చేయాల ని ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబ్ద నియంత్రణకు సర్క్యులర్ జారీ చేసి చేతులు దులిపేసుకోకుండా వాటిని అమలు చేయాలని ఆదేశించింది. ఆదేశాల అమలు నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. సికింద్రాబాద్ తాడ్‌బండ్, బోయినపల్లి లోని భాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డె న్స్ ఫంక్షన్ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజినీరు కల్నల్ జే సతీశ్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించి విచారణ చేపట్టింది.

దీనిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ శబ్ద నియంత్రణ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను అన్ని పోలీసు స్టేషన్లకు పంపినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 70 ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ హాళ్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో సరిపెట్టకుండా వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.