calender_icon.png 4 October, 2024 | 2:59 AM

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే నిషేధం

03-10-2024 01:23:22 AM

ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌పై నిషేధం విధిస్తూ సీపీ సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

డీజేల నుంచి అధిక డెసిబుల్స్‌తో ఉత్పన్నమయ్యే శబ్ధాల కార ణంగా గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమా దం ఉండడంతో పాటు చిన్న పిల్లల్లో శాశ్వత వినికిడి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

అంతేకాకుండా సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధు ల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఊరేగింపుల్లో డీజే, సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నిబంధనలను ఉల్లంఘిస్తే బీఎన్‌ఎస్ 223, 280, 293, 324, బీఎన్‌ఎస్‌ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని సీపీ సుదీర్‌బాబు వెల్లడించారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఎవరై నా అతిక్రమిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలకు, విధుల్లో ఉండే అధికారులకు కలుగుతున్న ఇబ్బందులు, తలెత్తుతున్న సమస్యలను విశ్లేషించి ప్రజలందరి అభిప్రా యాలను తీసుకున్న తర్వాతే ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ వివరించారు.