calender_icon.png 2 October, 2024 | 11:48 PM

సిటీలో డీజే నిషేధం

02-10-2024 02:37:15 AM

బాణసంచా, హై సౌండ్ ఎక్విప్‌మెంట్స్‌పై కూడా..

రూల్స్ అతిక్రమించే వారిపై చర్యలు తప్పవు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : మహానగర పరిధిలో వేడుక, శుభకార్యం, బరాత్, ఊరేగింపు ఏది జరిగినా సరే డీజే మోత మోగాల్సిందే. డీజే సౌండ్‌కు భూమి కూడా కంపించాల్సిందే.

అయితే.. అది వేడుక చేసుకునే వారికి బాగానే ఉంటుంది కానీ, ఇంట్లో పిల్లలు చదువుకునేటప్పు డు, ఆసుపత్రిలో రోగులు డెత్ బెడ్డుపై ఉన్నప్పుడు, రోజం తా పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు రాత్రి పూట నిద్రిస్తు న్నప్పుడు ఆ శబ్దాలు వస్తే ఎలా ఉంటుం ది? ఎంతటి వారికైనా విసు గు, చిరాకు కలుగుతాయి. ఆ శబ్దాలకు వృద్ధులకైతే గుండె దడ వస్తుంది.

ఆ శబ్దాలు వచ్చినప్పుడు డయల్ 100కు వందల సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో పోలీస్‌శాఖ ఒక నిర్ణయానికి వచ్చింది.  నగరంలోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వివిధ శాఖల అధికారులు, గ్రేటర్ పరిధిలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం చారు. వారి నుంచి విలువైన అభిప్రాయాలు తీసుకున్నారు. 

నగరంలో డీజేను బ్యాన్ చేస్తున్నట్లు తాజాగా సీపీ ప్రకటించారు. సౌండ్ సిస్టమ్ వినియోగానికి మాత్రం కాస్తంత వెసులుబాటు కల్పిస్తున్నామని, అలాగని ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగించేలా సౌండ్ పెడితే సహించబోమని హెచ్చరించారు. సౌండ్ సిస్టమ్ వినియోగానికి తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నాలుగు జోన్లలో సౌండ్ సిస్టమ్ శబ్దాలకు సంబంధించిన డెసిబిల్స్‌ను నిర్దేశించారు.

బాణసంచా నిషేధం

ఇక మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. వారికి గరిష్ఠంగా ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.లక్ష వర కు జరిమానా ఉంటుంది. అదే పనిగా నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.5 వేల చొప్పున జరిమానా తప్పదు. ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలోపు సౌండ్ సిస్టమ్ వినియోగించకూడదు.