దీపావళి పండుగను నేడు దేశ వ్యాప్తంగా జరుపుకుంటోంది. దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ నరకాసుర వధ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘దీపావళి’ సినిమాను గుర్తు చేసుకుందాం. ఎస్ రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య కథను అందించారు. నరకాసుర వధ సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ దీపావళిని జరుపుకుంటున్నారు.
ఈ నరకాసుర వధను దీపావళి చిత్రంగా రూపొందించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్, సత్యభామగా సావిత్రి, రుక్మిణిగా కృష్ణకుమారి, నరకాసురుడిగా ఎస్వీ రంగారావు నటించారు అనడం కన్నా జీవించారనడం ఉత్తమం. మరికొన్ని కీలక పాత్రల్లో కాంతారావు, గుమ్మడి, రమణారెడ్డి, ఎస్ వరలక్ష్మి తదితరులు నటించారు.
ఈ సినిమా ఆరంభమే నరకాసురుడితో ఉంటుంది. శివుని గురించి నరకాసురుడు తపస్సు చేస్తుంటాడు. ఆయన ఘోర తపస్సుకు ముల్లోకాల్లో ప్రకంపనలు వస్తుంటాయి. నరకాసురుడి తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. నరకాసురుడి కోరిక మేరకు భూమాత మినహా నిన్నెవరూ సంహరించలేరని వరమిస్తాడు. వర గర్వంతో నరకాసురుడి ఆగడాలకు అంతుండదు.
దేవతలు, సామాన్యులు అందరినీ హింసిస్తుంటాడు. అప్పుడు వారందరికీ నరకాసుర బాధ నుంచి విముక్తి కలిగించేందుకు శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరుతాడు. అక్కడ నరకాసురుడు త్రిశూలం విసరడంతో కృష్ణుడు మూర్చబోతాడు. అప్పుడు సత్యభామ విల్లందుకుని నరకాసురుడిని సంహరిస్తుంది. భూదేవి అంశే సత్యభామ అని చివరిలో శ్రీకృష్ణుడితో దర్శకుడు చెప్పిస్తారు. అలా సత్యభామ చేతిలో నరకాసురుడు హతమవుతాడు.
ఈ సినిమా ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది. సినిమా మొత్తం ఒక ఎత్తయితే చివరి పది నిమిషాలు మరో ఎత్తు. ఇక్కడ ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్ నటనా కౌశలాన్ని వీక్షించవచ్చు. త్రిభువన విజేత నరక సార్వభౌముని సంహరిస్తానని శపథం చేసిన వీరాధివీరుడవనుకున్న ఆయుధములు అలంకరించుకున్న అబలను అండగా తెచ్చుకునేంత అధముడివనుకోలేదంటూ కన్నయ్యను ఉద్దేశించి నరకాసురుడు చెప్పే డైలాగ్ కట్టిపడేస్తుంది.
దీంతో ఆగ్రహించిన సత్యభామ.. కృష్ణుడిని అసుర సంహారానికి పురగొల్పడం.. సమయం ఆసన్నమవుతుందని ఆమెను కన్నయ్య శాంతింపజేసే సీన్లు వాహ్ అనిపిస్తాయి. చివరకు నరకాసురుడు మరింత రెచ్చిపోయి ‘అస్త్రశస్త్రాలకు స్వస్తి చెప్పి నన్నాశ్రయించు నిన్ను మన్నించి నీ సౌందర్యాన్నారాధిస్తాను’ అని చెప్పడంతో సత్యభామకు కోపం తారాస్థాయికి వెలుతుంది.
‘బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు.. నిన్ను వధించి భూభారం తగ్గిస్తాను’ అని చెప్పి నరకాసురుడిని సంహరిస్తుంది. అప్పుడు మహాపరాధం చేశానంటూ సత్యభామ కాళ్లచెంత శరణువేడి నరకాసురుడు మరణిస్తాడు. నరకాసుర వధతో ప్రజలంతా ఆనందంగా టపాసులు కాల్చుకోవడంతో సినిమా పూర్తవుతుంది.
కొన్ని చిత్రాలను నిలబెట్టేది చివరిలో కొన్ని క్షణాలే... కానీ పాత పౌరాణిక చిత్రాలు మాత్రం ఆద్యంతం అలరిస్తాయి. చివరి పది నిమిషాలు అంతకు మించి అలరిస్తాయని దీపావళి చిత్రం ద్వారా మనకు తెలుస్తోంది. నరకాసుర వధ తర్వాత కృష్ణుడు, సత్యభామ ద్వారకకు తిరిగి రావడంతో ‘శ్రీకృష్ణ తులాభారం’ కథ ప్రారంభమవుతుంది.
ఈ చిత్రంలో సత్యభామ గర్వాన్ని చూపించారు. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్.. సత్యభామగా జమున నటించారు. ఒక సన్నివేశంలో శ్రీకృష్ణుడిని సత్యభామ కాలితో తంతుంది. ఈ సీన్‌పై అప్పట్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. కానీ ఆ సీన్ సినిమాలో అద్భుతంగా పండింది.
తర్వాత తులాభారం సన్నివేశంతో సత్యభామ గర్వాన్ని శ్రీకృష్ణుడు అణచివేస్తాడు. ఈ చిత్రంలో రుక్మిణిగా అంజలీ దేవి నటించారు. ఈ రెండు చిత్రాలు వేటికవే సాటి. ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు.. నభోత్.. నభవిష్యత్.
ప్రజావాణి చీదిరాల