- డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు
- ఫైల్‌పై సంతకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని వసతి గృహా ల్లో డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది.
డైట్ చార్జీలతోపాటు కా స్మొటిక్ చార్జీలను కూడా పెంచనున్నది. డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపునకు అధికారుల కమి టీ వేసిన సిఫార్సులను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించారు. చార్జీల పెంపును ఆమోదించే ఫైల్‌పై బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారు. ఇందులో భాగంగా 3వతరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు రూ. 950గా ఉన్న డైట్ చార్జీని రూ.1,330లకు పెంచారు.
దీంతో 2,77,877 మంది విద్యార్థు లు ప్రయోజనం పొందుతారు. 8వ తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న రూ. 1,100 డైట్ చార్జీని రూ.1,540లకు పెంచారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,59,328 మంది విద్యార్థులు లబ్ధిపొందుతారు.
ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న రూ.1,500గా ఉన్న డైట్ చార్జీని రూ.2,100 లుగా నిర్ణయించారు. దీంతో అన్ని వసతి గృ హాల్లోని 2,28,500 మంది విద్యార్థులు ప్ర యోజనం పొందుతారు. ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల ద్వారా మొత్తం 7,65,705 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవకాశం లభిస్తుంది.
కాస్మొటిక్ చార్జీలూ పెంపు..
రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడతోపాటు విద్యార్థునులకు సంబంధించిన కాస్మొటిక్ చార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థునులకు ఇప్పటివరకు రూ.55గా ఉన్న కాస్మొటిక్ చార్జీని రూ.175కు పెంచారు. 8వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థునులకు ఇప్పటివరకు ఉన్న రూ.75 గా ఉన్న కాస్మొటిక్ చార్జీని రూ.275కు పెంచారు. 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థుల(బాలురు)కు ఇప్పటివరకు ఉన్న రూ.62గా ఉన్న కాస్మొటిక్ చార్జీని రూ.150కి పెంచారు. 8వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల(బాలురు)కు ఇప్పటివరకు రూ.62గా ఉన్న కాస్మొటిక్ చార్జీని రూ.200లకు ప్రభుత్వం పెంచింది.