మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కార్మికులకు ఈ నెల 27న దీపావళి బోనస్ ను కార్మికుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లు సింగరేణి సిఅండ్ఎండీ బలరాం తెలిపారు. ఈ మేరకు శనివారం అన్ని ఏరియాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పదవీ విరమణ పొందిన కార్మికులకు 18.27 కోట్ల రూపాయల దీపావళి బోనస్ చెల్లిస్తున్నట్లు ఆయన వివరించారు. సింగరేణి సంస్థలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో,ఏప్రిల్ 1, 2024 నుంచి అక్టోబరు 24, 2024 మధ్యలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీమ్( దీపావళి బోనస్) ను విడుదల చేస్తున్నామని,ఈనెల 27వ తేదీన వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందన్నారు.పదవీ విరమణ పొందిన 2754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా 93750/- రూపాయలు చొప్పున మొత్తం 18.27 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 27న రిటైర్డు కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సంస్థ ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.