calender_icon.png 17 January, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంకల్పశక్తితోనే దివ్యానుభూతి

06-09-2024 12:00:00 AM

ఉపనిషత్ సుధ

“నచికేతా! నీ వంటి జిజ్ఞాసి అరుదుగా ఉంటాడు. కనుక విను!..

సత్యాన్వేషణలో ఉన్న సాధకుడు తన సంకల్పానికి సత్యభావనను, సత్యనిష్ఠను కలపాలి. అది నిస్వార్థంగా ఉండాలి. ఇదొక తిరుగు లేని జయకేతన స్థాయి. సత్యం, జ్ఞాన సమృద్ధం కనుక బుద్ధి నుండీ ఏర్పడే సంకల్పం బలాన్ని సంతరించుకుని, బుద్ధి జ్ఞానమయమవుతుంది. ఆపై వ్యర్థవాదాలకు తావు లేని బుద్ధి కుశలత, మనసును లక్ష్యం వైపు నడిపిస్తుంది. నిజానికి కర్మలన్నీ అటువంటి వికాసబుద్ధిని అనుసరిస్తయ్. చేసే పనులన్నీ వివేకవంతం, విచక్షణాంచితం అయి వ్యక్తిని, సమాజాన్ని సక్రమంగా సన్మార్గంలో నడిపిస్తయ్. సర్వమత సమ్మతమైన, సమాజహితమైన ధర్మమే జాతికి రక్ష.

జీవితమే అధ్యాత్మ వేదిక. ప్రతి క్షణాన్ని అధ్యాత్మమయం చేయాలి. మత సమన్వయం జాతి మనుగడకు శ్రీరామరక్ష! సంఘర్షణ, స్పర్ధ, అహంకారం, డాంబికం, స్వార్థం వంటి వ్యతిరిక్త భావనలు ఎవరికీ అక్కరకు రావు. మనసుని నిగ్రహించుకుంటూనే బుద్ధిని హేతుభావనతో నడిపించాలి. కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువునూ బుద్ధికుశలతతో చూడటం ప్రారంభించాలి. చివరకు, ఆ వస్తువు మూలాలను దర్శించగలగాలి. దీనికై సంకల్పశక్తి కావాలి. అంతా ఒకటే, నిజానికి ఉన్నదంతా ఒకటే!

ఏకం అనేకంగా కనిపిస్తున్న వస్తు ప్రపంచ మూలాన్ని పట్టుకోగలిగితే భేదభావం నశిస్తుంది. దేనిపట్లా తీవ్ర అపేక్ష, కారణం లేని ఉపేక్ష వంటి మనోస్థితులు ఉండవో, అదే శుద్ధ బుద్ధి!

శుద్ధ బుద్ధి, సంకల్ప శక్తి, నిరంతర సత్యాన్వేషణ, విశేష జ్ఞానం కలబోసుకున్న స్థితి నుండీ పుట్టిందే ప్రేమ. ఇది రాగ, అనురాగాలను మించిన దివ్య భావన! రాగబంధాలన్నీ రక్తగత బంధనలే! తనను కన్నవారు, తాను కన్నవారు, తోబుట్టువులు, రాగబంధానికి పరిమితమైన వారే! దుఃఖాలు, సుఖాలు, సంతోషాలు, ఆనందాల అనుభవాలు, సంయోగ వియోగాలు, మోద, ప్రమోద, విషాదాలు ఇవన్నీ కాలి మడమలకు తగిలించుకున్న సంకెళ్లు. సంకెలలు తెగటం, తెంపుకోవటం అంటూ ఉండదు. స్థితి, గతులు మారినప్పుడల్లా రాగబంధాలు బలపడటమో, బలహీనం కావటమో జరుగుతయ్. కానీ, ఏటిలో కెరటాల వలె నీటిలోనే అవి మసలుతుంటయ్!

రాగబంధం తర్వాతది అనురాగబంధం. ఇది నిత్యం మారుతూ ఉంటుంది. దీనికి నిబద్ధత లేదు, నిలకడ లేదు. ఈ రెంటినీ దాటిందే ప్రేమబంధం. ఇది ఏర్పడటం అంత సులభం కాదు. సంకుచితం, స్వార్థం ఎరగని శుద్ధ మనసు మాత్రమే దీనిని అనుభవించగలదు. ఇది తర్కబుద్ధికి లోబడదు. తత్త్వబుద్ధికి తప్పక సిద్ధిస్తుంది. సత్యనిష్ఠను, సద్వస్తువును కాంక్షించగల నిశ్చలబుద్ధి సత్యాన్వేషణను సులభతరం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే మనసు, బుద్ధి, చిత్తం ప్రేమగా రూపు దాల్చి, సాధకుణ్ణి ప్రేమమూర్తిని చేస్తయ్.

ఈ స్థితిలో మనిషి యోగంలో ఉన్నా, సంయోగంలో ఉన్నా, వియోగంలో ఉన్నా, భోగంతో సంగుడై ఉన్నా, నిశ్చలానందాన్ని బయటా లోపలా అనుభవిస్తాడు. లౌకికం, పారలౌకికమంటూ రెండూ లేని అమృత సిద్ధిని అనుభవమయం చేసుకుంటాడు. నిరంతరం అంతరంగ యాత్రను సాగిస్తాడు. అనిత్య, అశాశ్వత క్షణిక స్థితులను దాటి, నిత్య సత్య శాశ్వత ఆత్ముక స్థితిని అనుభూతిగా మిగుల్చుకుంటాడు. అంధకారం, అస్పష్టత, అనాచారం, అవిద్య వంటి తామస భావన నుండీ, వెలుగువైపు వడివడిగా అడుగులు వేస్తాడు. మృత్యుభావనను జయించి, అమృత స్థితిని స్థిరం చేసుకుంటాడు. ఈ ప్రయత్నమంతా సాక్షాత్కారంలో భాగమే!

ప్రేమ స్వరూపంగా నిలకడ చెందినవాడు, తనలోని దివ్యత్వాన్ని నిర్మల మనసు ద్వారా, నిశ్చలబుద్ధి ద్వారా, ప్రశాంత చిత్తం ద్వారా వెలుగులీనుతూనే ఉంటాడు. అదే సిసలైన సాక్షాత్కార స్థితి. సంకల్ప శక్తులు అనుగ్రహించే దివ్యానుభూతి ఇదే!... యముడి ఆత్మ విచారధారను అందుకుంటున్న నచికేతసుడు, ఆనందమయుడై, ప్రేమాంచిత రూపంగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ఆధ్యాత్మిక రాజమార్గం వైపు ఇంకా ఎదురు చూస్తున్నాడు, మరింత వినయంగా.

- వీయస్‌ఆర్ మూర్తి