22-12-2024 01:08:48 AM
ముషీరాబాద్, డిసెంబర్ 21: లక్షలాది మంది ఆలోచనలను పుస్తకరూపంలో తెచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లే రచయితల కృషి అభినందనీయమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఆయన సందర్శించి స్టాళ్లలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పుస్తకప్రియులతో మాట్లాడి కొన్ని పుస్తకాల గురించి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుస్తక పఠనం చాలా అవసరమని, పుస్తక పఠనం వల్ల దివ్యమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చని అన్నారు. వ్యక్తిత్వ నిర్మాణంలో పుస్తకాలు దోహదపడతాయన్నారు. లోతైన విజ్ఞానం రావాలంటే చదువు చాలా అవసరమని చెప్పారు. ఆయన వెంట బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యూకూబ్, సెక్రెటరీ ఆర్ వాసు తదితరులు ఉన్నారు.