calender_icon.png 25 October, 2024 | 5:53 AM

ఆత్మగౌరవం దెబ్బతీస్తే.. తెలంగాణ క్షమించదు!

30-05-2024 12:05:00 AM

ఉప్పెనలా ఉవ్వెత్తున్న ఎగిసినా మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజానికం తమ గొంతును ఢిల్లీ వర కు వినిపించారు. స్వరాష్ట్రకాంక్షతో చాలామంది ఉద్యమంలో క్రీయాశీలకంగా పాల్గొని ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఎందరో రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేశా రు. మరెందరో ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయారు. వారి త్యాగఫలితంగా.. ప్రజలలో వచ్చిన చైతన్యం వల్ల చివరికి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజల స్వరాష్ట్రకాంక్ష నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుంచి క్రీయాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు, సుచిత్ర జేఏసీ కన్వీనర్ నర్రా శ్రీనివాస్ రెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మి ఆయన వెంట నడిచాం. స్వరాష్ట్ర కాంక్షతో పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాం. 1400 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకుపోతాడని, ప్రజల బాగోగులను చూసుకుంటాడని నమ్మి కేసీఆర్ వెంట 2001 నుంచి ప్రయాణం మొదలు పెట్టాం. ప్రాణాలను ఫణంగా పెట్టిన ఉద్యమకారులకు ఎంతో సపోర్టు చేస్తాడు అనుకున్నాం. కానీ అలా చేయలేదు. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల మీద పెట్టిన ఉద్యమం కాస్త ముందుకు వెళ్లి ఆంధ్రావాళ్ల చేతిలో అణిగిపోతున్నామని తెలుసుకుని, మన ఆత్మగౌరవం గురించి, మన స్వయం పాలన దిశగా ఉద్యమాన్ని నడిపించాం. ఏది చేసినా 1400 మంది ఆత్మల బలిదానం తర్వాత జాతి, కుల, మత భేదాలు లేకండా అందరూ కలిస్తేనే తెలంగాణ ఏర్పడ్డది.

వచ్చిన తెలంగాణలో కూడా తెచ్చినటువంటి కేసీఆర్‌కు అధికారం ఇద్దామని 63 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాలో 23 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజానీకం గెలిపించారు. మొదటి ఐదు సంవత్సరాలు తెలంగాణ కొత్తది అనుకుంటూ పాలించడం జరిగింది. అది నమ్మిన తెలంగాణ ప్రజానీకం ఐదు సంవత్సరాల సమయం సరిపోలేదని మరోసారి కేసీఆర్‌కు అవకాశం కల్పించింది. రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్‌కు అహంకారం నెత్తికెక్కింది. నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనమనుకుంటూ ప్రయాణం సాగించాడు. ఎంతో గొప్పవారైన తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్‌ను వారి ఇంటి తలుపుల ను బద్దలు కొట్టి అరెస్ట్ చేశాడు. అంతేకాకుండా ముఖ్యులైన కొండా లక్ష్మణ్ బాపూజీని, ఆచార్య జయశంకర్‌ని, ఆలె నరేంద్రని తక్కువ చేశాడు. ఆయన మనసంతా అధికారం, డబ్బు, కులాలు, మతాలపైనే పెట్టాడు.

తెలంగాణలో ఇంతక ముందు అందరూ కలిసి మెలిసి జీవించేవారు.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులాలుగా సమాజాన్ని విభజించాడు. ఎందుకంటే గౌడ సామాజిక వర్గ ఆత్మగౌరవ సభ, బ్రాహ్మణ, రెడ్డి, నాయీ బ్రాహ్మణ, పద్మశాలీల ఆత్మగౌరవ సభల పేరుతో విభజించి సమావేశాలు నిర్వహించాడు. అదే విధంగా తెలంగాణ ఉద్యమ కారులనంతా పక్కన పెట్టి ఆనాడూ తెలంగాణను వ్యతిరేకించిన రాజకీయ పార్టీల నాయకులను, అధి కారులను భుజం ఎక్కించుకుని తెలంగాణ ప్రజల మీద దాడి చేశారు. వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కీలకమైన పదవులిచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులను, నాయకులను పక్కకు తోసేశారు. ఉద్యమం లో భాగంగా ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పార్టీని పెద్ద ఎత్తున బలోపేతం చేశారు.

తెలంగాణ భవన్ కట్టడానికి స్వంత నిధులనిచ్చారు. ఈటల వైపు తెలంగాణ సమాజమంతా వెళ్తుందని, అర్ధరాత్రి ఆయనపై వేటు వేసి ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి భయబ్రాంతులకు గురి చేశారు. ఇంటికి వెళితే కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఉద్యమ కారులను కొట్టించడం, కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేశారు. రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను, కొందరు ప్రైవేట్ వ్యక్తులను ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది. ఇలా పాలనను పక్కతోవకు పట్టించినందుకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కోరుకునే తెలంగాణ ప్రజలు విపరీతమైన కోపంతో కేసీఆర్‌ను ఇంటికి పంపించారు. తెలంగాణ ప్రజానీకం ఎంతటి బరువునైనా మోస్తది కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం క్షమించదు.