calender_icon.png 30 September, 2024 | 3:10 AM

ఎల్లారెడ్డిలో తరిగిపోతున్న గుట్టాలు

30-09-2024 01:05:36 AM

అక్రమంగా మొరం తవ్వకాలు

పట్టించుకోని అధికారులు

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి)/ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. అధికారులకు తెలిపి మరీ దర్జాగా మొరం దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఉన్న గుట్టలను తవ్వుతూ అక్రమార్కులు మొరం దందాను కొనసాగిస్తున్నారు.

అధికారులకు మామూళ్లు ముట్టచె ప్పడంతో ఎన్నో గుట్టలు మాయం అవుతున్నా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను అధికారులు గుట్టుగా అక్రమార్కులకు చేరవేస్తున్నారు. దీంతో అక్రమా ర్కులు ఫిర్యాదు చేసిన వారితో రాజీ కుదుర్చుకుని, ఫిర్యాదులను వెనక్కి తీసుకునేలా చేస్తున్నారు. మరికొందరు అక్రమార్కులు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. 

మున్సిపల్ పరిధిలోని గుట్టల మాయం

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మున్సిపాలిటీల పరిధిలోని గుట్టలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. ఇటీవల ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని గండిమాసానిపేట్‌లోని పందికరెనె కుచ్చలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఎల్లారెడ్డిలో ఆర్డీవో ప్రభాకర్‌కు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్నోసార్లు మొరం తవ్వకాలపై ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో టిప్పర్ల ద్వారా వేలాది ట్రిప్పుల మొరంను అక్రమార్కులు తరలిస్తున్నా. ఎల్లారెడ్డిలో ఎదురుగా వస్తే టిప్పర్‌తో గుద్ది రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని చెబుతామంటూ బహిరంగంగా బెదిరించడం గమనార్హం. గుట్టలను అక్రమంగా తవ్వుతుండటంతో వృక్షసంపద కనుమరుగు అవ్వడమే కాకుండా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణ?

జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న గుట్టలను తవ్వి భూమిని అక్రమించుకునేందుకే చదును చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో గుట్టలు కనుమరుగు అయ్యాయి. 

అధికార పార్టీ నేతల అండ?

అక్రమార్కులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతోనే యథేచ్ఛగా మొరం దందా చేస్తున్నారని తెలుస్తున్నది. దీనికి తోడు అక్రమాలను నియంత్రించాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో రాత్రికి రాత్రే గుట్టలను మాయం చేస్తున్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట్, బీబీపేట్, భిక్కనూర్, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో ఉన్న గుట్టలు ఇప్పటికే మాయం అయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, లింగంపేట్ మండలాల్లో ఉన్న గుట్టలు మాయమై పంట పొలాలుగా మారాయి.

బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రూల్లాబాద్, బాన్సువాడ మండలాల్లోని గుట్టలలో మొరం తవ్వకాలు దర్జాగా జరుగుతున్నాయి. జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం, నిజాంసాగర్ మండలాల్లోని పదుల సంఖ్యలో గుట్టలు ఇప్పటికే మాయం అయ్యాయి.