- అదుపుతప్పి బోల్తా కొట్టిన పోలీసు వాహనం
జనగామ ఎస్సైకి తప్పిన ప్రాణాపాయం
పట్టించుకోకుండా వెళ్లిపోయిన భట్టి విక్రమార్క
జనగామ, జనవరి 5 (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ జనగామ నుంచి వెళ్తుండగా అపశృతి చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న ఎస్సై వాహ నం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వరంగల్ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి జనగామ మీదుగా వెళ్తున్నారు. పెంబర్తి కళాతోరణం వద్ద జనగామ ఎస్సై డిప్యూటీ సీఎంకు కాన్వాయ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
భట్టి కాన్వాయ్ రాగానే ఎస్సై వాహనం అందులో కలిసిపోయి ముందుగా వెళ్తోంది. కాన్వాయ్ హైస్పీడుతో ఉండటంతో ఆ స్పీడును అందుకునేందుకు ఎస్సై వాహన వేగాన్ని ఒక్కసారిగా పెంచడంతో కళాతోరణం నుంచి కొద్ది దూరం వెళ్లగానే మూలమలుపు వద్ద అదుపుతప్పింది. ఫల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన గల చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది. సుమారు వంద మీటర్ల దూరం ఫల్టీలు కొట్టి ఆగిపోయింది.
వాహనం దెబ్బతినగా ఎస్సై చెన్నకేశవులు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. జనగామ సీఐ దామోదర్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా కళ్ల ముందే తన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైతే కనీసం కారు ఆపకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోవడంతో అక్కడున్న పోలీసు సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.