calender_icon.png 23 February, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాకో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్

22-02-2025 01:44:15 AM

* మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే లక్ష్యం

* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

* నారాయణ పేటలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ప్రారంభం 

నారాయణపేట, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా మహి ళా సంఘాల సభ్యులకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ర్టంలోని ప్రతి జిల్లాలో ఒక పెట్రోల్ బంకును మహిళా సమాఖ్యకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.  నారాయణపేట జిల్లాలోని సింగారం ఎక్స్ రోడ్డు వద్ద రూ.1.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులను శుక్రవారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు ఒక పెట్రోలు బంకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామని వెల్లడించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడితే వారి కుటుంబంలోని పదిమందికి సహకరించే విధంగా ఉంటారని, వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా తమ పిల్లల భవిష్యత్తుకు ఖర్చు చేస్తారని తెలిపారు.

మహిళల అభివృద్ధి ద్వారా వారి కుటుంబం గౌరవంగా బతకడానికి ఉపయోగపడుతుందన్నారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశామని  జరిగిందని గుర్తు చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా మహిళల అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం అన్ని రంగాల్లో సహకారము అందిస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు వ్యాపారాల కోసం బ్యాంకు లింకేజీలతో  రుణాలను విరివిగా అందిస్తామని చెప్పారు.

రాష్ర్టంలో ప్రస్తుతం 60 లక్షల మంది మహిళలు సంఘాలుగా ఏర్పడ్డారని, రాబోయే రోజులలో కోటి మంది మహిళలను సంఘాలలో చేర్చే విధంగా మహిళా సంఘం అధ్యక్షులు కృషి చేయాలని కోరారు. ఐకేపీ ద్వారా మహిళలకు పెట్రోల్ బంకులు కేటాయించడంతోపాటు 600 ఆర్టీసీ బస్సులను అందజేసి యజమానులుగా తయారు చేశామని ఉద్ఘాటించారు. దేశంలో మొదటిసా రిగా సోలార్ పార్కుల ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలు వ్యాపార వెత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

మహిళా సంఘాల సభ్యులకు ఒకే డ్రెస్ కోడ్ అమలు చేసే విధంగా వెయ్యి కోట్ల రూపాయలతో నాణ్యమైన రెండు జతల చీరలు అందించనున్నట్లు వెల్లడించారు.  హైదరాబాద్‌లోని శిల్పారామంలో మహిళా సంఘా ల సభ్యులు రూపొందించిన ఉత్పత్తులను కార్పొరేట్ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే విధంగా మూడు ఎకరాల స్థలం లో వెయ్యి కోట్ల రూపాయలతో ఆకర్షణీయమైన మా ర్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.

ఇందిరమ్మ ఇంటి  నిర్మాణానికి భూమి పూజ

రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి  సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా శంకుస్థాపన చేశారు. నారాయణపేట జిల్లా అప్ప నపల్లిలోని బీ దేవమ్మకు  చెందిన స్థలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.

మెడికల్ కాలేజీ ప్రారంభం 

నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. మారుమూల ప్రాంతంలో మెడికల్, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు.  గతంలో కేంద్రం తిరస్కరించినా తమ మంత్రి,  అధికారులు తీవ్రంగా ప్రయత్నించి ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని.. అది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు.

కాలేజీలో పూర్తిస్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. న్నారు. నిజమైన పేదవాడికి సంక్షేమ పథకాలు చేరినప్పుడే అభివృద్ది జరిగినట్టు అని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. వైద్య విద్యారుల అవసరాలపై అవగాహన ఉన్నవారే నారాయణ పేట ఎమ్మేల్యేగా ఉన్నారని చెప్పారు.

పేదలకు విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, వైద్య వృత్తి ఒక ఉద్యోగం కాదని.. ఒక బాధ్యత గా గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. యాబై ఏళ్ళు ఇక్కడి ప్రజలకు సేవలందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరు ఈ కాలేజీకి పెట్టడం సముచితమని తా భావిస్తున్నానని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.