calender_icon.png 7 November, 2024 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం జిల్లాల పర్యటన

03-07-2024 01:34:35 AM

త్వరలో షెడ్యూల్ విడుదల

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలు తీరును స్వయంగా పరిశీలన

వినూత్నంగా ఆలోచించండి

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన చేయాలి

నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష

ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): త్వరలోనే వారానికో జిల్లా పర్యటనకు వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభు త్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో  వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. అక్కడి  ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని అధికారులను సీఎం అప్ర మత్తం చేశారు. త్వరలోనే తన జిల్లా పర్యటనలకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేస్తామని తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమం త్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీంఎ మాట్లాడుతూ.. అధికారులందరూ ఏకతాటిపై పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలని ఆదేశించారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో అయిదు గ్యారంటీలను అమలు చేసిందని చెప్పారు. తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపా లనపైనే దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. 

ఐఏఎస్‌లు విభాగాలపై పట్టు సాధించాలి

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని రాష్ర్టంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని దిశా నిర్దేశం చేశా రు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని సూచించారు. 

వారానికో రోజు క్షేత్ర పర్యటనకు వెళ్లాలి

ప్రజలకు సుపరిపాలనను అందించేందు కు అధికారులు క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం చెప్పారు. వేళాపాళలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి రోజు టైమ్ ప్రకారం సెక్రేటేరి యట్లో అందుబాటులో ఉండాలని సూచించారు. కేవలం ఆఫీసులకు పరిమితం కాకుం డా తమ విభాగం పనితీరును పర్యవేక్షించేందుకు  వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధి కారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత విభాగం చేపట్టిన కార్యక్రమాలు, జరుగుతున్న పనుల పురోగతిని ఉన్నతాధికారులు తెలుసుకోవాలని సూచించారు. 

పనితీరును బట్టే అవకాశాలు

వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సీఎం తేల్చిచెప్పారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని,  కేవలం పని తీరు ఆధారంగానే అధికారులకు తదుపరి ఉన్నత అవకాశాలుంటా యని, బాగా పని చేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని అధికారులకు సీఎం భరోసా ఇచ్చారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని, సీఎం కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు అధికా రులు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

వినూత్న ఆలోచనలను సీఎంవోతో పంచుకోవాలి

ఉమ్మడి రాష్ర్టం నుంచి ఇప్పటివరకు  పలువురు ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవమున్న అధికారులు ఇప్పటికీ రాష్ట్రంలోని కీలక విభాగాల్లో ఉన్నారని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాతలను గుర్తించి అధికారులు తమ పనితీరును చాటుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలనే సంకల్పంతో విధులు నిర్వహించాలని, ప్రజల సంక్షేమం, రాష్ర్ట అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని కోరారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారు లపైనే ఉందని అన్నారు. తమ శాఖల పని తీరును మెరుగుపరిచేందుకు అవసరమైతే అధికారులు, సిబ్బంది ప్రక్షాళన చేసుకోవాలని సీఎం సూచించారు. రాష్ర్టంలో ప్రజ లకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలని సీఎం సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్ షిప్ ఐడియాను రెండు వారాల్లో  ప్రభుత్వానికి సమర్పించాలని ఐఏఎస్‌లను ఆదేశించారు.

కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి

చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారు లు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, తమ అనుభవంతో సుపరిపాలన విధానాలు అమలు చేయాలని సూచించారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చూడాలని సీఎస్‌ను సీఎం ఈమేరకు ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు విజిట్ చేయాలని చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సం ఘటనలు, దుర్ఘటనలన్నింటిపై అధికారులు సత్వరమే స్పందించాలని కోరా రు. అన్ని శాఖల్లో మెరుగైన విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన గుర్తు చేశారు.