15-04-2025 05:40:21 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి సీనియర్ మహిళ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో పాల్గొనేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, ఆశ్రమ పాఠశాల క్రీడా అధికారి బండ మీనా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొనగా ఎంపిక పోటీల్లో క్రీడా నైపుణ్యం కనబరిచిన 20 మంది క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఎంపికైన వారికి ఈ నెల 18వ తేదీ నుండి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జరగనున్న 54వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ విభాగం పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఎంపికైన జట్టు ప్రాతినిత్యం వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఎం ఓ ఉద్ధవ్, పాఠశాల హెడ్మాస్టర్ జంగు, కోచ్ లు అరవింద్, రవి, రాకేష్, సాయి, సంజీవ్, సాగర్, సీనియర్ క్రీడాకారుడు ప్రవీణ్, మాన్విత్ పాల్గొన్నారు.