15-03-2025 11:34:29 PM
జపాన్ ‘సకురా’కు సాయిశ్రీవల్లి ఎంపిక..
మంచిర్యాల (విజయక్రాంతి): జపాన్ లో నిర్వహించే ’సకురా’ అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు మంచిర్యాల జిల్లా విద్యార్థిని ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా 54 మంది విద్యార్థులను కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో నదవ తరగతి చదువుతున్న సాయిలు సాయిశ్రీవల్లి ఎంపికయ్యారు. శ్రీవల్లి స్త్రీల నెలవారి రుతుక్రమం ప్రక్రియలో వినియోగిస్తున్న రసాయానిక శానిటరీ ప్యాడ్ వినియోగ సమస్యలను దూరం చేసేందుకు బట్ట ప్యాడ్‌ల వినియోగం, వాటిని సులభంగా శుభ్రపరిచే పరికరం (‘శ్రీస్ రుతు మిత్ర’ ప్రాజెక్టు) తయారు చేసి ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ 2020 పోటీలలో పాల్గొని ఉత్తమంగా నిలిచింది. జూన్ 15 నుంచి 21వ తేదీ వరకు జపాన్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ ‘సకురా’ సైన్స్ ఎక్సేంజ్ కార్యక్రమానికి ఎంపికైంది. శ్రీవల్లిని డీఈఓ యాదయ్యతో పాటు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ఎస్‌ఓలు శ్రీనివాస్, చౌదరి, సత్యనారాయణమూర్తి, యశోధర, పాఠశాల యాజమాన్యం తదితరులు అభినందించారు.