calender_icon.png 16 March, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్ సకురా అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు జిల్లా విద్యార్థి ఎంపిక

15-03-2025 08:21:19 PM

జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య...

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సాయిలు సాయి శ్రీవల్లి పాఠశాల స్థాయి విద్యార్థుల వినూత్న ఆలోచనలను పంచుకునే అంతర్జాతీయ వేదిక  జపాన్ 'సకురా' సైన్స్ ఎక్సేంజ్ కార్యక్రమానికి ఎంపికైందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. యాదయ్య శనివారం తెలిపారు. దేశం నుంచి సకురాకు 54 మంది విద్యార్థులను కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని, ఈ ముగ్గురిలో మన జిల్లా విద్యార్థిని శ్రీవల్లి ఉండటం జిల్లాకు గర్వకారణమన్నారు. 

ఆవిష్కరణలకు ఆకర్షితులై..

ఆవిష్కరణలకు ఆకర్షితులై జపాన్ ప్రభుత్వం సకురా సైన్స్ హై స్కూల్ ప్రోగ్రాం ద్వారా వారి దేశ సందర్శనకు అవకాశం కల్పించిందని డిఇఓ యాదయ్య తెలిపారు. అక్కడి నూతన సాంకేతికతను దగ్గరుండి తెలుసుకొని శాస్త్రీయ నూతన ఆలోచనలు, ఆవిష్కరణ రూపకల్పనకు తమ సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఆహ్వానం పలికిందన్నారు. జపాన్ సకుర కార్యక్రమం జూన్ 15 నుంచి 21 వరకు జరుగుతుందని, ఎంపికైన విద్యార్థుల బృందం వారం రోజులపాటు జపాన్ లో పర్యటించనుందని. దీనికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 

జాతీయస్థాయి ఇన్స్పైర్ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులు 15 సంవత్సరాల వయసు కల్గి ఉండి, 10 నుంచి 12 తరగతిలో చదువుతున్న విద్యార్థులకు ఈ జపాన్ సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని అర్హతలు సాధించి జిల్లా విద్యార్థిని శ్రీవల్లి ఈ అవకాశం అందుకుందన్నారు.

ఎంపిక విధానం...

జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయిలు సాయి శ్రీవల్లి స్త్రీల యొక్క నెలవారి రుతుక్రమం ప్రక్రియలో వినియోగిస్తున్న రసాయనిక శానిటరీ పాడ్ వల్ల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపాలని శ్రీస్ రుతుమిత్ర కిట్ పరికరం సొంతంగా రూపొందించింది. రుతుక్రమ సమయంలో రసాయనిక శానిటరీ ప్యాడ్ వినియోగ సమస్యలు దూరం చేసేందుకు బట్ట ప్యాడ్ వినియోగం, వాటిని సులభంగా శుభ్రపరిచే పరికరము తయారు చేసి జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికయి, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి ఇన్స్పైర్ 2020-21 పోటీలలో పాల్గొని, అందరిని ఆకట్టుకొని ఉత్తమంగా నిలిచింది.

అంతేకాక దేశంలోని సామాన్య వ్యక్తుల సృజనాత్మకతను గుర్తించడం, గౌరవించడం, సత్కరించడం లక్ష్యంగా డిల్లి లోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇంటర్ ఫ్యునర్షిప్ 2023 ఫైన్ కార్యక్రమానికి కూడా ఆహ్వానం అందుకోని, ఆ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేక అభినందనలు పొందింది. ప్రాజెక్టు రూపకల్పనపై తన ఆలోచన అనుభవాలను శ్రీవల్లి రాష్ట్రపతితో ముచ్చటించారు.

పలువురి అభినందనలు...

జపాన్ లో జరిగే అంతర్జాతీయ సైన్స్ ఎక్సేంజ్ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థిని సాయి శ్రివల్లిని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్యతో పాటు జిల్లా సైన్స్ అధికారి ఎస్. మధుబాబు, సెక్టరాల్ అధికారులు శ్రీనివాస్, చౌదరి, సత్యనారాయణ మూర్తి, యశోధర, శ్రీ చైతన్య పాఠశాలల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ జోబిన్ తదితరులు అభినందించారు.