calender_icon.png 16 March, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరోసా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పి..

15-03-2025 10:58:10 PM

మహిళలకు అండగా భరోసా కేంద్రం.. 

తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు, సహాయం అందించాలి.. 

జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్...

కామారెడ్డి (విజయక్రాంతి): లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ "భరోసా సెంటర్" అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ అన్నారు. వడ్లురు రోడ్డుకు గ్రీన్ హోమ్ లో గల భవనంలో వున్న భరోసా సెంటర్ ను జిల్లా ఎస్పి సందర్శించారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, పోలీసులు సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో 'భరోసా' కేంద్రం పని చేస్తుందని అన్నారు. బాధితులు రాగానే సత్వర న్యాయానికి కృషి చేస్తారని పెర్కొన్నారు.

లైంగిక దాడులకు గురైనా బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా పోక్సో, లైంగికదాడుల కేసులు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా సెంటరుకు తీసుకొస్తున్నామన్నారు. తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు అందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు అందించి, వారికి ఎవరూ లేనప్పుడు భరోసా సెంటర్ లో ఆశ్రయం కల్పించాలన్నారు.

వీటితో పాటు ఈ భరోసా సెంటర్లు బాధితులకు నైపుణ్యాలను నేర్పించి, వారిని సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతుందన్నారు. అందుబాటులో వున్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదులను పరిశీలించిన ఎస్పి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి కె. నరసింహ రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, భరోసా సెంటర్ యస్ఐ జ్యోతి, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.