19-02-2025 07:48:38 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు, మైనింగ్ అధికారులు విధుల్లో ఉన్నారా లేరా అని, వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారా లేదా అని, ముఖ్యంగా గంజాయి, ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న అధికారుల పనితీరును ఆకస్మికంగా తనిఖీలు చేసి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఇసుక గంజాయి అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా ఎస్పీ కలెక్టర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తన ఎస్కార్ట్ వాహనంలో కాకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇతర వాహనంలో ఆకస్మికంగా బ్రిడ్జి చెక్ పోస్ట్ వచ్చి ఇటీవల ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు.
అంతర్రాష్ట ఛత్తీస్ ఘడ్, ఆంధ్రా, సరిహద్దు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిగా వాహనాలు రవాణా జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా గంజాయి రవాణా, ఇటీవల జిల్లాలో ఏర్పాటు చేసిన ఇసుక రవాణా జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి ఎక్కడక్కడ అక్రమ రవాణా కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నిరంతరం చెక్ పోస్ట్ లను జిల్లా బాస్ లు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న రిజిస్టర్ లను తనిఖీ చేసి కాసేపు వాహనాలను తనిఖీలు చేసి పోలీసుల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ రెస్ట్ రూమ్ లో అన్ని వసతులు ఉన్నాయా లేవా అని చెక్ చేసి మైనింగ్, పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ అధికారులకు, సిబ్బందికి పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు.