ఇల్లెందు (విజయక్రాంతి): జిల్లా క్షయ, ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాలాజీ నాయక్ బుధవారం టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సిబ్బందితో సమావేశమయ్యారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు 15 రోజులు పాటు లెప్రసీ వ్యాధిపై ప్రతి గ్రామంలో ప్రజలతో, పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కుష్ఠు వ్యాధిపై అవగాహన సమావేశాలు నిర్వహించి అనుమానితుల్ని గుర్తించడం కోసం సర్వే చేయాలని ఆదేశించారు. అలాగే క్షయ వ్యాధి అనుమానితుల్ని గుర్తించడం కోసం జరుగుతున్న నిక్షయ్ షివిర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా ప్రచారం చేయాలని క్షయ వ్యాధి అంతానికి ప్రజల్లో నిత్యం అవగాహన కల్పించడం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.
ఫిబ్రవరి 10న జరిగే జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమంలో 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు లోపు వయసున్న పిల్లలందరికీ విధిగా నులిపురుగు నివారణ ట్యాబ్లెట్ లు మింగించాలని కోరారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం తడికలపూడిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నాగభూషణం, వజ్జా పార్వతి, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, సూపర్వైజర్లు గుజ్జా విజయ, కౌసల్య, సింగ్, పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.