మూడు ప్రైవేట్ ఆస్పత్రుల సందర్శన సమగ్ర దర్యాప్తు ప్రారంభం
మూడు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రైవేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ స్త్రీ మృతి చెందిన ఘటనపై నాగర్ కర్నూల్ జిల్లా వైద్యాధికారిని స్వరాజ్యలక్ష్మి శుక్రవారం మూడు ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెల 25న తెలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన రాములమ్మ (25) మూడు నెలల గర్భవతి కాళ్లు చేతులు తిమ్మిర్లు సమస్యతో ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించింది. ఒకరి తర్వాత మరొకరు సరైన వైద్యం అందించకుండా రెఫర్ చేస్తూ నాలుగు ఆస్పత్రులను మార్చి వైద్యానికి ఆలస్యం చేస్తూ తన చావుకు కారణమయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రులపై ఫిర్యాదు చేశారు. విషయంపై శుక్రవారం జిల్లా వైద్యాధికారిని స్వరాజ్యలక్ష్మి జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర ఆసుపత్రి, గాయత్రి ఆసుపత్రులను తనిఖీ చేసి షోకేస్ నోటీసులు అందించారు. శివ నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్య సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. వైద్యం కోసం వచ్చిన గర్భిణిని డబ్బులకు కక్కుర్తి పడి ఒకరి మీద ఒకరు రెఫర్ చేస్తూ సమయం వృధా చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా కాకుండా వైద్యులు సేవే లక్ష్యంగా రోగులకు వైద్యం అందించాలని సూచించారు. వారి వెంట హెల్త్ సూపర్వైజర్ ఓ శ్రీనివాసులు, రేనయ్య ఉన్నారు.