29-03-2025 07:26:33 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డును అందుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించేలా జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని బాలల దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత, ప్రతి మంగళవారం పోషకాహారంపై అవగాహన, ప్రతి బుధవారం ఒత్తిడి నివారించుకునే మార్గాలు, ప్రతి గురువారం డ్రగ్స్ కు దూరంగా ఉండడం, ప్రతి శుక్రవారం సీజనల్ వ్యాధుల నివారణ, ప్రతి శనివారం వ్యక్తిత్వ వికాసం ఇలా ఆరు సూత్రాలపై 4 వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంతో విద్యార్థులకు అవగాహన కలిగించారు.
విద్యార్ధులు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, రేపటి భావిభారత పౌరులు మీరేనని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, చదువులో రానిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకొని ఆదర్శవంతంగా నిలవాలని ఏర్పాటు చేసిన ఈ వినూత్న కార్యక్రమంతో విద్యార్థుల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్య పాఠశాల కార్యక్రమ నిర్వహణతో జిల్లా కలెక్టర్ స్కోచ్ అవార్థు కు ఎంపిక కావడం ఈ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీలో పద్మశ్రీ డాక్టర్ దీపక్ బి పతాక్, స్కోచ్ గ్రూప్ వైస్ చైర్మన్ డాక్టర్ గురుశరన్ ధాంజల్ చేతుల మీదుగా స్కోచ్ అవార్డును అందుకున్నారు.