హనుమకొండ: వర్షాల కారణంగా దెబ్బతిన్న హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామ శివారులో నిర్మాణంలో రోడ్డు, అదేవిధంగా పరకాల శివారులో ఉన్న చలివాగు వంతెన ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కంఠాత్మకూర్ వద్ద ఉన్న వాగులో నుండి వరద ఉదృతంగా పోతుండడంతో దెబ్బతిన్న కాజ్ వే ను కలెక్టర్ సందర్శించి అక్కడి వంతెన రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం గురించి, అక్కడి పంటలకు సంబంధించిన వివరాలను స్థానిక రైతులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. రహదారిపై నిర్మిస్తున్న వంతెనతో ఆ మార్గంలో రాకపోకలు లేకుండా బోర్డులను ఏర్పాటు చేయాలని, అక్కడ సిబ్బందిని కాపలాగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.
అదేవిధంగా పరకాల శివారులోని చలివాగు వంతెన వర్షాల కారణంగా దెబ్బతినగా కలెక్టర్ పరిశీలించి మరమ్మతు పనులు చేపడుతున్న జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. సాయంత్రం లోగా మరమ్మతు పనులు పూర్తిచేయాలని ఎన్.హెచ్ డి ఈ కిరణ్, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పురపాలక, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, నడికుడ, పరకాల తహసిల్దార్లు నాగరాజు, భాస్కర్, పరకాల పురపాలక కమిషనర్ నరసింహ, ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్ అండ్ బి డి ఈ ఎండి గౌస్, ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.