2022-23 సంవత్సరానికి మహిళా ఫ్రెండ్లీ పంచాయతీలలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైన చిల్లపల్లి గ్రామం
65 లక్షల నగదు బహుమానం గెల్చుకున్న చిల్లపల్లి
పెద్దపల్లి (విజయక్రాంతి): మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి వచ్చిన జాతీయ పంచాయతీ అవార్డును జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు. 2022-23వ సంవత్సరంలో మహిళ ఫ్రెండ్లీ పంచాయతీలలో దేశంలోనే మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడం జరిగిందని, గ్రామంలోని ఆరు సంవత్సరాల పిల్లలందరినీ ఐసిడిఎస్ లో రిజిస్టర్ చేయడం, గ్రామ సభలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం, స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందడం, మాతా శిశు మరణాలు సున్నాకు తగ్గడం, బాలికల విద్య ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు చిల్లపల్లి గ్రామం ఉత్తమ గ్రామంగా ఎంపిక చేశామని, ఉత్తమ మహిళ ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికైన చల్లపల్లి గ్రామానికి రూ.65 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చిందని, ఈ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
భవిష్యత్తులో ఇదే రీతిలో మహిళల అభ్యున్నతి కొరకు గ్రామంలో పనులు జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.పి.ఓ. వీర బుచ్చయ్య, జడ్పీ సీఈవో నరేందర్డి, డి.ఆర్.డి.ఓ. రవీందర్, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ కుమార్, ఎంపిడిఓ పూర్ణ చందర్ రావు, మండల పంచాయతీ అధికారి శేషా సూరి, డి.పి.ఎం రజాక్, పంచాయతీ కార్యదర్శి రాం కిషోర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.