calender_icon.png 22 March, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి రోజు పది పరీక్షలు ప్రశాంతం: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

21-03-2025 11:24:30 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం పదవ తరగతి పరీక్షల ప్రారంభంలో భాగంగా తొలిరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్ బర్డ్స్ పాఠశాల, పాల్వంచలోని కేటీపీఎస్ కాలనీలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఏర్పాటుచేసిన వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష రాసే తరగతులను, సీసీ కెమెరాలు అమరిక, పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు మరియు విద్యార్థులు కూర్చుని పరీక్ష రాసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన బెంచీలను గమనించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

పరిక్షా కేంద్రాల చుట్టూ ప్రహరీ గోడలు సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలను శుభ్రంగా ఉంచుకోవాలని చిత్తు కాగితాలు లేకుండా, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిబంధన ప్రకారం వసతులు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లకు లోను కాకుండా పరీక్షలు మంచిగా రాయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొదటిరోజు ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగాయని, జిల్లావ్యాప్తంగా  12,269 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 99% హాజరు నమోదు అయిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలకు  విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని, తొలి రోజు విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్షలు రాశారని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులు ఒత్తిడికి గురు కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.