calender_icon.png 9 January, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెక్టోరియల్ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచన...

08-01-2025 05:43:24 PM

సెక్టోరియల్ అధికారులు 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకే విధులకు హాజరుకావాలి..

అధికారం ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్... 

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం వివిధ సెక్టార్లలో విధులు నిర్వహించే అధికారులు 10వ తేదీ ఉదయం 3 గంటలకు తమ వీధులలో అందరూ హాజరుకావాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్( Collector Jitesh V Patil) హెచ్చరించారు. బుధవారం భద్రాచలంలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు విధులు కేటాయించబడిన వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్టార్లలో డ్యూటీలు కేటాయించబడిన అధికారులు 10 తేదీ ఉదయం విధులలో చేరుకొని భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు వారి సెక్టార్లలో కూర్చునే విధంగా చూడాలని, వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లను, అనారోగ్యంతో ఉన్న వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత అధికారులు పోలీస్ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలని, ఎవరైనా భక్తులు అస్వస్థతకు గురి అయితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్య శిబిరానికి తరలించి వైద్య చికిత్సలు చేయించాలని అన్నారు. వీఐపీలు, వివిఐపీల వెంట వచ్చే సిబ్బంది ఎవరైనా ఏమైనా గొడవలకు దిగితే పోలీస్ సహకారం తీసుకొని గొడవలు కాకుండా చూడాలని, దేవుని దగ్గర అందరం సమానమే అని వారికి నచ్చ చెప్పాలని అన్నారు. ఏమైనా సమస్య ఉంటే వెంటనే వాకిటాకిల ద్వారా కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని అన్నారు. ముఖ్యంగా తొమ్మిదవ తారీకు సాయంత్రం తెప్పోత్సవం 10వ తారీకు ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని, అధికారులకు ఆర్డిఓ కార్యాలయంలో భోజన వసతి సౌకర్యాలు కల్పించామని అన్నారు.

ఈ సంవత్సరం ఏరు (రివర్) ఫెస్టివల్ ఆదివాసి గిరిజనులకు సంబంధించిన కార్యక్రమం రూపొందించడం జరిగిందని 9, 10, 11 తేదీలలో సాయంత్రం గిరిజనులకు సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే ఆదివాసి గిరిజన వంటకాలు, గోదావరిలో బోట్ సౌకర్యం, ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియం పర్యాటకుల కోసం ప్రత్యేకంగా గోదావరి పక్కన ప్రత్యేక క్యాంపెయింగ్ ఏర్పాటు చేశామని, ఈ మూడు రోజులే కాకుండా ప్రతిరోజు నిర్వహించి మార్చి వరకు కొనసాగించేలా చేస్తున్నామని అన్నారు. రివర్ ఫెస్టివల్ లో ఆదివాసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా ఆదివాసి వంటకాలు, ఇతర కళాఖండాలు ఆదివాసి కల్చర్ కు సంబంధించిన వస్తువులు అమ్ముకొని వారి జీవనోపాధికి తోడ్పాటు అందించడానికి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారులు రివర్ ఫెస్టివల్ కార్యక్రమం విజయవంతం అయ్యేలా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో దామోదర్ రావు, ఈవో రమాదేవి, భద్రాచలం తాసిల్దార్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.