calender_icon.png 1 April, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కళాకారులకు టివి, సినీ రంగాలలో అవకాశం కల్పించాలి

29-03-2025 08:11:57 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని కళాకారులకు టి.వి., సినీ రంగాలలో అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ కల్చరల్ అకాడమీ ఓం సాయి తేజ ఆర్ట్స్ - సంయుక్త నిర్వహణలో జిల్లాలోని వివిధ రంగాల కళాకారులకు టి.వి., సినీ రచయితలకు, దర్శకులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని టి.వి. సీరియల్ దర్శకుడు నాగబాల సురేష్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో కళాకారులకు, క్రీడాకారులకు కొదువ లేదని, కళాకారులు వివిధ రాణిస్తున్నారని అన్నారు.

జిల్లాలో టి.వి. సీరియల్, సినిమా షూటింగ్ లకు అనువైన ప్రదేశాలు జిల్లాలో చాలా ఉన్నాయని, జిల్లాలో ప్రాచీన దేవాలయాలు, జలపాతాలు, సింగరేణి గనులు, సిర్పూర్ కాగిత పరిశ్రమ, ప్రాణహిత, పెద్దవాగు పరివాహక ప్రాంతాలు, కొమురం భీం ప్రాజెక్టు వంటి సుందరమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే పట్టుదల, కఠోర శ్రమ ఉంటుందని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. సినీ, కళారంగంలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి. వి. సీరియల్ దర్శకులు ప్రేమ్ రాజ్, స్థానికులు డి. రామారావు, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, రాధాకృష్ణచారి, బిట్టు వెంకటేశ్వర్లు, సునీల్, సంతోష్, కళాకారులు పాల్గొన్నారు.