calender_icon.png 17 April, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్టు మెషీన్లు, సానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లు పంపిణీ

11-04-2025 12:02:51 AM

పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ సాయి చైతన్య 

నిజామాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారికి తోడ్పాటుగా నిలిచేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున అందిస్తున్న చేయూతను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలని జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల హితవు పలికారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మినీ మోడ్యూల్ క్యాంపు నిర్వహించారు. దాతల సహకారంతో పలువురికి కుట్టు మెషీన్లు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, డిచ్పల్లి మానవతా సదన్, కస్తూర్బా విద్యాలయాలకు సానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లు పంపిణీ చేశారు.

లేబర్ డిపార్ట్మెంట్ తరపున అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను, మెప్మా ఆధ్వర్యంలో 21 స్వయం సహాయక సంఘాలకు రూ. 2.50 కోట్ల విలువ గల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ,  ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లు, అసంఘటితరంగ కార్మికులు వంటి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి, సమాజంలోని పేదరిక నిర్మూలనకు పాటుపడాలనే జాతీయ న్యాయ సేవా సంస్థ లక్ష్యానికి అనుగుణంగా డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఈ మోడ్యూల్ క్యాంపు ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఎంతగానో పని ఒత్తిడితో కూడుకుని ఉండే విధుల్లో కొనసాగుతున్నప్పటికీ జిల్లా జడ్జి  విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు.   పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, పేదరికం అంటే కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదని, అందాల్సిన సేవలు అందకపోవడం, విద్య, వైద్య సేవలకు దూరంగా ఉండడం వంటివి కూడా పేదరికంగానే పరిగణించబడతాయని అన్నారు. 

ఈ  సందర్భంగా కుట్టు మెషీన్లు, సానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లు సమకూర్చిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, వివిధ శాఖల  అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.