calender_icon.png 22 February, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనవాసీ ఆద్వర్యంలో గిరిజనులకు రగ్గుల పంపిణీ

21-02-2025 07:10:38 PM

చర్ల (విజయక్రాంతి): మండలంలోని మారుమూల అటవీప్రాంత గ్రామమైన కొరకట్ పాడులో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆద్వర్యంలో రగ్గులను పంపిణీ చేసారు. శుక్రవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో 60 కుటుంబాలను వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు చేతుల మీదుగా రగ్గుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివాసీల కొరకు సంస్ద చేస్తున్న సేవలను వివరించారు. ఆదివాసీ చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చర్ల మండల కేంద్రంలో కొమరం భీం విద్యార్ది నిలయం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనేక గిరిజన గ్రామాలలో రాత్రి బడులను నిర్వహించి నిరక్షరాస్యులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నట్లు తెలిపారు.

ఆదివాసీలు కూరగాయలు పండించుకొని పౌష్టికాహారం భుజించేలా ప్రతి ఏటా జూన్ నెలలో కూరగాయలు, ఆకు కూరల విత్తనాలను అందిస్తున్న విషయాన్ని గుర్తుచేసారు. ఆదివాసీలకు మెరుగైన వైద్య సేవలను అందచేసేందుకు అంబులెన్స్ ద్వారా గ్రామాలలో వైద్య శిభిరాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నిరుపేదలకు రగ్గులు, దుప్పట్లు, దుస్తులను అందించడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజనులు సంస్ద ద్వారా చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలోని గిరిజనులకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో వనవాసీ మండల ప్రముఖ్ ఇర్ప రాజు, ఇర్ప రమేష్, డాక్టర్ ఏ పరమేష్, బండారి జగదీష్ పాల్గొన్నారు.