23-04-2025 01:09:11 AM
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వినూత్న ప్రచారం
జగిత్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పార్టీ పండక్కి పత్రికలు పంచుతూ ఆహ్వానించి కొత్త ఒరవడి సృష్టించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. సాధారణంగా పెళ్లి, గృహ ప్రవేశం, నామకరణం మొదలైన శుభ కార్యాలకు పత్రికలు అచ్చు వేయించి, పలువురికి పంచుతూ ఆహ్వానించడం పరిపాటే. అయితే ఈ సాంప్రదాయం, ఆచారం కేవలం వ్యక్తిగతంగా మనం నిర్వహించుకునే పండగలకి మాత్రమే వర్తిస్తుంది.
కానీ సమాజంలో ఓ నూతన ఒరవడికి తెర లేపుతూ, పార్టీ పండక్కి పత్రికలు అచ్చు వేయించి, ప్రముఖులతో పాటూ సంఘాల వారిని ఆహ్వానించడం ప్రత్యేకతను సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పదేళ్ల పాటూ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ బిఆర్‌ఎస్.
పార్టీ పాతికేళ్ల పండుగను ఎంతో సంబరంగా, కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రాంతం వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పండక్కి తెలంగాణ నలుమూలలా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1 లక్ష మందిని తరలించి కని, విని ఎరుగని రీతిలో వేడుకలు నిర్వహించేందుకు పార్టీ అధినేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో పార్టీ పండగ ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అచ్చంగా పెళ్లి పత్రిక వంటి ఆహ్వాన పత్రికను బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల గురించి ముద్రించారు. సదరు పత్రికలు పట్టుకొని నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ప్రాంతాల్లో జోరుగా పర్యటిస్తున్నారు.
ప్రతీ ప్రాంతంలోని పార్టీ క్యాడర్కు ముందస్తు సమాచారమందించి అక్కడికి వెళ్తున్నారు. ఆ ప్రాంతంలోని ప్రముఖులతో పాటూ కుల సంఘాల ప్రతినిధులను, యువజన, మహిళా సంఘాల నాయకులను వ్యక్తిగతంగా కలిసి పత్రిక ఇచ్చి, వరంగల్ సభ (పార్టీ పండక్కు) రావలసిందిగా ఆహ్వానిస్తున్నారు.
ఇలా సరికొత్త పద్ధతిలో పార్టీ పండక్కి ప్రచారం చేయడం ఆకట్టుకుంది. ఈ క్రమంలో కోరుట్ల సెగ్మెంట్ నుండి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లక్ష మందిని తరలించడం ఖాయమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ముందెన్నడూ లేని రీతిలో పార్టీ పండక్కి పత్రికలు అచ్చు వేయించి పంచుతూ ఒక కొత్త విధానానికి తెరలేపారు.