calender_icon.png 26 October, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస

26-10-2024 01:37:07 AM

  1. తులం బంగారంపై నిలదీసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్
  2. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

జనగామ, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పరస్పర విమర్శలతో రసాభాసగా మారింది.  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రీ గార్డెన్ శుక్రవారం తహసీల్దార్ వెంకన్న ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేదికపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అనిత మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్, కార్యకర్తలు ఒక్కసారిగా గొడవకు దిగారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షం అన్నప్పుడు హామీలపై నిలదీస్తారని, దానికి ఓపికగా సమాధానం చెప్పాలే తప్ప ఆగ్రహానికి గురికావడం తగదని కాంగ్రెస్ నేతలనుద్దేశించి అన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు మరింత ఆగ్రహానికి గురై గత బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ కౌన్సిలర్ గాదెపాక రాంచందర్.. ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి ఫొటో లేకపోవడంతో గొడవ చేశారు. ఇలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య గొడవతో కాసేపు కార్యక్రమం రసాభాసగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో ఆ తరువాత కార్యక్రమం సజావుగా సాగింది. ఎమ్మెల్యే పల్లా, మార్కెట్ చైర్మన్ శివరాజ్ చేతులమీదుగా 93 మందికి చెక్కులు పంపిణీ చేశారు.