- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చొచ్చుకుపోయిన కాంగ్రెస్ నాయకులు
- దసరాలోపు చెక్కులు పంచకపోతే కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు అక్రమంగా చోరబడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు
- రేపు 10 గంటల లోపు అధికారులు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలి
- లేనిపక్షంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఫర్యా చేస్తాం - బీఆర్ఎస్ నాయకులు
గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి రోజురోజుకూ పెద్ద గొడవలా మారుతుంది. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దసరాలోపు చెక్కులను పంపిణీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపును ముట్టడించారు. క్యాంపు కార్యాలయంలోని చిత్రపటానికి వినతిపత్రాలను అందజేశారు. మిగతా నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ జరుగుతున్నా గజ్వేల్లో కేసీఆర్ లేకపోవడం వల్లే నిలిచిపోతున్నాయన్నారు. దసరాలోపు కల్యాణ లక్ష్మి చెక్కులను పంచాలని, లేనిపక్షంలో కేసీఆర్ ఇంటిని చుట్టుముడతామని గజ్వేల్ ఎఎంసి చైర్మన్ నరేందర్రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గా డిపల్లి భాస్కర్లు హెచ్చరించారు.
కాగా కాంగ్రెస్ నాయకులు అక్రమంగా క్యాంపు కార్యాలయంలోని చోరబడ్డారంటూ బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ మంత్రులు కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్లు ఉన్నా చెక్కుల పంపిణీకి స్థానిక కాంగ్రెస్ నాయకులే అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు. మంగళవారం ఉదయం 10గంటల లోపు అన్ని గ్రామాల కల్యాణలక్ష్మి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలని లేనిపక్షంలో బుధవారం 9గంటలకు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, కౌన్సిలర్ చందు, మాజీ ఎఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, బెండమధు, మద్దిరాజిరెడ్డి, విరాసత్ అలీ, మాజీ జడ్పీటీసీ పంగమల్లేశం, మర్కంటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.