16-04-2025 12:00:00 AM
కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే సహాపంక్తి భోజనం ...
గద్వాల, ఏప్రిల్ 15 ( విజయక్రాంతి ) : పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సంపన్నులతో సమానంగా సన్న బియ్యాన్ని అందజేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ లు తెలిపారు. మంగళవారం కేటిదొడ్డి మండలం మల్లాపురం గ్రామంలో లబ్దిదారుడు సురేష్ నాయక్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా వారు ముందుగా లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హత గల ప్రతి పేదవాడికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
తద్వారా రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సన్న బియ్యం అందుతాయని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, గద్వాల్ మార్కెట్ యార్డు చైర్మన్ నల్ల హనుమంతు తహసీల్దార్ హరికృష్ణ,అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.