02-04-2025 06:34:38 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం రెబ్బెన మండలం కేంద్రంలోని చౌక ధరల దుకాణంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర అధికారులతో కలిసి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. జిల్లాలోని 314 పౌరసరఫరాల దుకాణాల ద్వారా ప్రతి రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పేర్ల తొలగింపులు, చేర్పులు చేసుకోవచ్చని, బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బియ్యం పంపిణీ ప్రక్రియలో ఏదైనా అక్రమాలు చేపడితే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, బియ్యం పంపిణీ చేసే పౌరసరఫరాల దుకాణాల వద్ద కార్డుదారుల కొరకు నీడ, త్రాగునీరు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కోవ లక్ష్మి మాట్లాడుతూ... అర్హులైన పేదవారి కడుపు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి పండుగ వాతావరణంలో అర్హులైన అందరికీ అందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం అర్హులైన రేషన్ కార్డుదారులకు కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తుందని, ప్రతి కార్డుదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ సక్రమంగా నిర్వహిస్తూ కార్డుదారులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి వారికి కూడా సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, రెబ్బెన మండల తహసిల్దార్ రామ్ మోహన్ రావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు రంగు మహేష్, సంబంధిత అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.