05-04-2025 10:24:33 PM
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..
చెన్నూర్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల 21 నంబర్ల గల చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ మల్లికార్జున్ లతో కలిసి సందర్శించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదవారి కడుపు నిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వం రైతుల నుండి సన్న బియ్యం కొనుగోలు చేసి కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అదనంగా అందించిందని, రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సరిపడా సన్న బియ్యం అందుబాటులో ఉంచామన్నారు.
రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం...
అనంతరం రేషన్ కార్డు రేషన్ లబ్ధిదారుడు మేడ తిరుపతిరెడ్డి ఇంట్లో చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ మల్లికార్జున్ లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం చేశారు. లబ్ధిదారుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, తహసిల్దారులు తన ఇంట్లో భోజనం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌక ధరల దుకాణాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.