02-04-2025 12:19:13 AM
-క్షేత్రస్థాయిలో పరిశీలించిన అదనపు కలెక్టర్, డీఎస్‌ఓ
- కాంగ్రెస్ నేతల సంబరాలు
మేడ్చల్, ఏప్రిల్ 1(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభమైంది. కార్డుదారులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చి సన్న బియ్యం తీసుకున్నారు. సన్న బియ్యం అందడంతో కార్డుదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. జిల్లాలో బియ్యం పంపిణీ ప్రక్రియను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారిని సుగుణబాయి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉప్పల్, నాగోలు రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులతో మాట్లాడారు. రామంతాపూర్ ఎం ఎల్ ఎస్ పాయింటును పరిశీలించి తగు సూచనలు చేశారు.
కాంగ్రెస్ నేతల సంబరాలు
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, షామీర్పేట మండలం లాల్ గడి మలక్పేట్ లో నక్క ప్రభాకర్ గౌడ్, కుతుబుల్లాపూర్ నియోజక వర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి నగర్ లో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలను హనుమంత్ రెడ్డి, బోడుప్పల్లో మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్, ఉప్పల్లోని భరత్ నగర్ మైసమ్మ దేవాలయం వద్ద రేషన్ దుకాణంలో కార్పొరేటర్ రజిత, నియోజకవర్గ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు
కొన్నిచోట్ల బిజెపి నాయకుల సైతం పోటాపోటీగా పాల్గొన్నారు. సన్న బియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎక్కువ ఉందని, కేంద్ర ప్రభుత్వం సహాయం వల్లే సన్న బియ్యం అందుతున్నాయని వారు పేర్కొన్నారు.