02-04-2025 12:00:00 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
అట్టహాసంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
నిజామాబాద్, ఏప్రిల్ 01:(జయ క్రాంతి) నిరుపేద కుటుంబాలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాలలోని 13,10,012 మందికి ప్రతీ నెల 8248.076 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో 3,80,222 కుటుంబాలు ఆహార భద్రత కార్డులు ఉండగా, వాటి పరిధిలోని 12,50,996 మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 7505.856 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
అంత్యోదయ కార్డులు 20,916 ఉండగా, వాటి పరిధిలోని 57,997 మందికి 732.060 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. అన్నపూర్ణ కార్డులు 1016 ఉండగా, 1039 మందికి 10.160 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ప్రతీ నెల పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గల 759 ప్రజా పంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాల) ద్వారా కార్డుదారులందరికీ నిర్దేశిత కోటా మేరకు సన్న బియ్యం పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
అట్టహాసంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
కాగా, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి లాంచనంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ, కోటగల్లి, అహ్మద్ పురా కాలనీ లలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయ అధికారి రవి రాథోడ్, స్థానిక అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.