15-03-2025 11:48:57 PM
సంఘ విద్రోహశక్తులకు యువత దూరంగా ఉండాలి... మంచిర్యాల డిసిపి భాస్కర్...
బెల్లంపల్లి (విజయక్రాంతి): పోలీసులు-మీ కోసం కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బెజ్జాల గ్రామంలో శనివారం రాబిన్ హుడ్ ఆర్మీ, యన్.జి.ఓ-స్నోమ్యాన్ సహకారంతో తాండూర్ పోలీస్ ఆధ్వర్యంలో 365 మంది ఆదివాసి గ్రామాల ప్రజలకు మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ లు నిత్యాసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంచిర్యాల డిసిపి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ లకు గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. డిసిపి భాస్కర్ మాట్లాడుతూ.... ప్రజల భద్రత కోసం పోలీసుశాఖ ఎల్లప్పుడు ముందుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరారు. సంఘవిద్రోహ శక్తుల మాటలను ఎవరూ నమ్మవద్దన్నారు. మంచిర్యాల ఐటిఐ కళాశాల వద్ద ప్రభుత్వం గిరిజన యువతకు భోజన వసతితో కూడిన ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు.
యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును కొనసాగించాలని చెప్పారు. వెనుకబడిన ప్రాంతమైన బెజ్జాల గ్రామాల ప్రజలకు పోలీసులతో స్నేహపూర్వక సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివాసి గ్రామాల ప్రజలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాదారం, తాండూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచడంతో కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. గంజాయి మొక్కల పెంపకంతో యువత చెడు దారిన పడుతుందని గుర్తు చేశారు. గంజాయి, మద్యపానానికి యువత దూరంగా ఉండి మంచిని అలవాటు చేసుకోవాలని కోరారు. అనంతరం డిసిపి భాస్కర్, ఏసిపి రవికుమార్ లు ఆదివాసీలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాదారం, ఎస్సైలు సౌజన్య మహేష్, కిరణ్ కుమార్ లతో పాటు గిరిజన పెద్దలు పాల్గొన్నారు.