calender_icon.png 5 October, 2024 | 8:56 AM

90 కోట్ల ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం

05-10-2024 12:33:28 AM

తొలి విడతలో 9 జిల్లాల్లో షురూ

ఈనెల 7 నుంచి మిగతా జిల్లాల్లో పంపిణీ

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో మత్స్యకారులు కుటుం బాలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,357 చెరువుల్లో 90 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. వీటి కోసం  రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించారు.

ఆగస్టులోనే సీడ్ పంపిణీ చేయాల్సి ఉండగా ధరల విషయంలో ప్రభుత్వానికి, గుత్తేదార్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో టెండర్ల ప్రక్రియ నెలరోజుల పాటు ఆలస్యమైంది. ఎట్టకేలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో చేప పిల్లల పంపిణీని అధికారులు ప్రారంభించారు. ఈనెల 3వ తేదీ నుంచే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదులుతున్నారు.

తొలి విడత కింద తొమ్మిది జిల్లాలను ఎంపిక చేశారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్  జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేశారు.

రెండో విడత చేప పిల్లల పంపిణీ ఈనెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చేప పిల్లల సైజ్‌ను బట్టి భారీ, మధ్య తరహా, చిన్న రిజర్వాయర్లలో 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 86 కోట్ల చేప పిల్లల పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.