28-03-2025 01:47:31 AM
వరంగల్, మార్చి 27(విజయక్రాంతి): రోజురోజుకు ఎండలు పెరుగుతుండడంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో రైతులు, గుమస్తాలు, కార్మికులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వ్యవసాయ మంత్రి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, జిల్లా కలెక్టర్ కు మజ్జగి ప్యాకెట్లు పంపిణీ చేయాలంటూ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అభ్యర్థించారు.
ఆయన అభ్యర్థన మేరకు గురువారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఉప్పుల శ్రీనివాస్ , సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి రాజిరెడ్డి, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీని ప్రారంభించారు.
తొలిరోజే 4 వేల మజ్జిగ ప్యాకెట్ల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో చాంబర్ గౌరవ ప్రధాన కార్యదర్శి మడూరి వేద ప్రకాష్ , కోశాధికారి అల్లే సంపత్ , కాటన్ సెక్షన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎన్ రెడ్డి లింగారెడ్డి, గుమస్తా సంఘం అధ్యక్షుడు ఎనుముల మల్లేశం, కార్యవర్గ సభ్యులు, హమాలీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.