calender_icon.png 23 October, 2024 | 1:02 PM

భూదాన్ బోర్డు రద్దు చట్టబద్ధమే

09-08-2024 12:54:49 AM

  1. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
  2. బోర్డు మాజీ చైర్మన్, సభ్యుల అప్పీళ్లు డిస్మిస్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ప్రత్యేక అధికారిగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని నియమించటం సబబేనని ప్రకటించింది. బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది. ఈ అంశంపై ప్రశ్నించే చట్టబద్ధమైన అధికారం అప్పటి చైర్మన్, సభ్యులకు లేదని స్పష్టం చేసింది. భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం 2015లో జారీచేసిన జీవో 59ని సవాలు చేస్తూ జీ రాజేందర్‌రెడ్డి, సభ్యులు వీ సుబ్రమణ్యం తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పిటిషన్‌ను కొట్టివేయడంతో వారు అప్పీల్ చేశారు. అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ప్రభుత్వం భూదాన్ యాజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి అప్పీలుదారులను చైర్మన్, సభ్యులుగా నియమించిందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకుందని, అయితే బోర్డు స్థానంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ జీవో 11 జారీ చేసిందని గుర్తుచేశారు.

దీనిపై చైర్మన్, సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి స్టే ఇవ్వటంతో ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిందని తెలిపారు. జీవో 11ను హైకోర్టు కొట్టివేస్తూ బోర్డును కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందని, అనంతరం ప్రభుత్వం బోర్డును ఎందుకు రద్దు చేయరాదో చెప్పాలంటూ చైర్మన్, సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకున్న తరువాత బోర్డును రద్దు చేస్తూ జీవో 59 జారీ చేసిందని వివరించారు. షోకాజ్ నోటీసుకు అప్పీల్‌దారులు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. జీవో 11ను కొట్టివేస్తూ మొదట ఇచ్చిన తీర్పే అంతిమం అని వాదించారు. బోర్డు రద్దుకు గల కారణాలను షోకాజ్ నోటీసులోగానీ, జీవోలోగానీ వెల్లడించలేదని తెలిపారు.

ఫోర్జరీ లేఖతో నియామకాలు

పిటిషనర్ల వాదనను ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. ఢిల్లీలోని మహిళా చేతన్ కేంద్ర అధ్యక్షురాలు డాక్టర్ వీనాబెహన్ పేరుతో ఫోర్జరీ లేఖను సృష్టించి, దాని ఆధారంగా నాటి ప్రభుత్వం పిటిషన్‌దారులను చైర్మన్, సభ్యులుగా నియమించిందని తెలిపారు. వాస్తవానికి వీనాబెహన్ తాను అలాంటి లేఖ రాయలేదని చెప్పారని, తనకు వినోభాభావేకు చెందిన సర్వసేవా సంఘ్ ఎలాంటి అధికారాలు అప్పగించలేదని ప్రభుత్వానికి లేఖ రాశారని వెల్లడించారు. రాష్ట్ర విభజన తరువాత చట్టాన్ని అన్వయించుకుంటూనే బోర్డుకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ జీవో 11 జారీ చేసిందని తెలిపారు. బోర్డును రద్దు చేయకుండా ప్రత్యేక అధికారిని నియమించడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు.

అనంతరం షోకాజ్ నోటీసు జారీచేసి, వారి వివరణ తీసుకున్నాకే ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రికార్డులను పరిశీలిస్తే భూదాన్ బోర్డు చట్టబద్ధంగా ఏర్పాటైనట్లు లేదని పేర్కొంది. నకిలీ లేఖ ద్వారా నియామకం జరిగినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. అంతేగాక అప్పీల్‌దారులు ఇబ్రహీంపట్నంలో 150 ఎకరాలను విక్రయించడం, 35 ఎకరాలు ఎస్‌వీఎస్ రైతు డెయిరీకి, 15 ఎకరాలు గోపాల్ గోశాల ట్రస్టుకు లీజుకు ఇవ్వడం, శంషాబాద్‌లో 32 ఎకరాలను అనర్హులకు కేటాయించడం, బాటసింగారంలో 16.32 ఎకరాల్లో ఇళ్ల పాట్ల విక్రయం తదితర ఆరోపణలను సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారని గుర్తుచేసింది.

షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ధర్మాసనం పేర్కొన్నది. క్రిమినల్ కేసులున్నాయన్నదానిపై బోర్డు చైర్మన్, సభ్యులు విభేదించడంలేదని తెలిపింది. బోర్డు రద్దును ప్రశ్నించే చట్టబద్ధ హక్కులు అప్పీల్ దారులకు లేవని ప్రకటించింది. అందువల్ల భూదాన్ బోర్డును రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని అప్పీళ్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.